డీజిల్ కార్లా.. వద్దు బాబోయ్.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Aug 2020 11:48 AM GMT
డీజిల్ కార్లా.. వద్దు బాబోయ్.!

పెట్రోలుతో పోలిస్తే డీజిల్ ధర తక్కువ. కాబట్టి ఇంధన భారం తగ్గుతుందన్న ఉద్దేశంతో డీజిల్ కార్లను కొంటుంటారు. పెట్రోలు కార్లతో పోలిస్తే డీజిల్ కార్ల ధర కొంచెం ఎక్కువే ఉంటుంది. ఆ పెరిగే ధరను ఇంధన ఖర్చు తగ్గించుకోవడం ద్వారా భర్తీ చేసుకోవచ్చని భావిస్తారు జనాలు.

కానీ ఇప్పుడు కథ మారిపోయింది. డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పెట్రోలు ధరలకు సరి సమానంగా అయ్యాయి. రెంటికీ పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. దీంతో డీజిల్ కార్ల వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం లేకపోయింది. అవి భారంగా మారిపోయాయి. దీంతో మార్కెట్లో కూడా డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గిపోయింది. జాటో అనలిటిక్స్ అధ్యయనంలో కూడా ఇదే తేలింది.

పెట్రోలు కార్లతో పోలిస్తే డీజిల్ కార్ల ధర రూ.లక్ష, అంత కంటే ఎక్కువ ఉండటం.. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం పెద్దగా లేకపోవడంతో డీజిల్ కార్ల పట్ల వినియోగదారులు ఆసక్తి చూపించట్లేదని ఈ అధ్యయనంలో తేలింది. దీనికి తోడు కొత్తగా వచ్చిన బీఎస్6 ఇంజిన్‌తో ఈ వేరియెంట్ల ధర ఇంకా పెరగడం ఈ కార్ల కొనుగోలు తగ్గడానికి కారణంగా జాటో వెల్లడించింది.

ఈ తగ్గుదల సెడాన్‌తో పాటు ఎస్యూవీ వేరియెంట్లలోనూ ఉంది. డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చు కూడా పెరిగిపోయి నిత్యావసరాల ధరలూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే పరిణామం. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డీజిల్ మీద రాష్ట్ర పన్నును కొంత మేర తగ్గించి అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. ఈ బాటలో మిగతా సీఎంలు కూడా నడవాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నప్పటికీ పెద్దగా స్పందన లేదు.

Next Story