ఈసారి వెండి కేజీ లక్షకు చేరుకుంటుందా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 5:49 AM GMT
ఈసారి వెండి కేజీ లక్షకు చేరుకుంటుందా?

కేజీ వెండి ఎంత? అన్నంతనే రూ.30 నుంచి రూ.40వేలు చెప్పేస్తారు. ఎక్కువమంది రూ. 30వేల‌ దగ్గరే ఆగుతారు. మరి.. అలాంటి వెండి ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోవటమే కాదు.. రికార్డు స్థాయిలో ధర నమోదు కావటం తెలిసిందే. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. దానికి తోడుగా చైనాతో ప్రపంచ దేశాల మధ్య నడుస్తున్న లొల్లి.. ఏకంగా ఒకలాంటి అనిశ్చితి వాతావరణం పెరిగేలా చేసింది. దీనికి తోడు.. ముడిచమురు ధరలుపడిపోవటం.. డాలర్ కాస్త బలహీనంగా ఉండటంతో అందరి చూపులు బంగారం.. వెండి మీదనే పడ్డాయి.

దీంతో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో కేజీ వెండి రూ.77,840కు చేరుకొని ఆల్ టైం హై అన్నట్లు మారింది. మరోవైపు బంగారం కూడా చెలరేగిపోతోంది. గడిచిన పదహారురోజుల నుంచి ముందు చూపే కానీ.. నేల చూపు చూడని బంగారం.. తాజాగా పదిగ్రాములు ఆల్ టైం హైకి చేరుకుంది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం రూ.57,008కు చేరింది.

ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర 45శాతం పెరిగితే.. వెండి ధరలో ఏకంగా 65 శాతం పెరిగింది. గడిచిన మూడు వారాల్లో వెండి జోరు మామూలుగా లేదనే చెప్పాలి. ఎనిమిది నెలల్లో పెరిగిన ధరలో 45 శాతం పెరుగుదల ఇరవై రోజుల్లో చోటు చేసుకోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో వెండి ధర కేజీ రూ.లక్ష చేరటం ఖాయమన్న విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే.. లక్షను టచ్ చేసే విషయంలో పలు సందేహాలు ఉన్నాయి.

అయితే.. అలా పెరగటం ఏమీ అసాధ్యం కాదని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఒకదశలో రూ.25వేల కనిష్ఠ స్థాయికి పడిన వెండి.. ఈ రోజు ఏకంగా రూ.73వేలకు చేరిన వైనం చూస్తే.. అంతర్జాతీయంగా పరిణామాలు మరింత దారుణంగా మారితే.. కేజీ లక్షరూపాయిలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే.. ఇంత భారీగా పెరిగిన వేళ.. వెండి కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

ముఖ్యంగా వెండి మీద పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేయాలన్న మాట వినిపిస్తోంది. ఆల్ టైం హైరికార్డుకు నమోదైన ధరలు మరింత పెరుగుతాయన్న మాట వినిపిస్తున్నా.. అవి అక్కడే స్థిరపడతాయన్న విషయంలో మాత్రం ఎవరూ ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పెరిగే ధరల్ని ప్రాతిపదికగా తీసుకోవటం అంత మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Next Story