కాఫీ రుణం తీర్చుకుంటాం..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  6 Aug 2020 7:19 AM GMT
కాఫీ రుణం తీర్చుకుంటాం..!

లక్ష్యాలు ఉన్నతంగా ఉంటేనే సరిపోదు.. నడిచే దారిని అన్వేషించడం ప్రధానం. అన్నీ బాగున్నప్పుడు.. బాగున్నాయని అనిపించినపుడు ఏదీ కష్టంగా ఉండదు. కానీ ఉన్నట్టుండి ఉత్పాతం ముంచుకొస్తే ? ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడితే.? పట్టు సడలకుండా గట్టిగానే సంస్థను నడపిస్తున్నారనుకునే వారే అకారణంగా అనూహ్యంగా అదృశ్యమైపోతే? ఎవరెలా ఉంటారో తెలీదు గానీ మాళవిక మాత్రం నిబ్బరంగా నిలుచుంది. నింపాదిగా నడుద్దాం అనుకుంది. సమస్యల చిక్కుముడులు ఒక్కొక్కటిగా విడదీసే పనిలో పడింది. కాఫీడే నాన్‌ ఎగ్జిక్యుటివ్‌ సభ్యురాలు, సంస్థ యజమాని సిద్దార్థ అర్ధాంగి.. ఇవాళ ఒంటరిగానే ప్రతికూల పరిస్థితులతో యుద్ధం చేస్తోంది. ఇన్వెస్టర్లు, పన్ను అధికారులు, ఆడిటర్లకు సైతం లెక్కతేలని బకాయిలను క్రమంగా తీరుద్దాం భయపడకండి.. మనం మునుపటిలాగానే కాఫీడేను ముందుకు తీసుకెళదాం అంటూ ఉద్యోగులకు ఇటీవల ఓ లేఖ రాసింది. ఆ లేఖ ఆశలుడిగిన ఉద్యోగులకు చెప్పలేనంత భరోసా కల్పించింది. ఒక్కసారిగా వారిలో ఉత్సాహం ఇనుమడించింది.

గతేడాది జులై 29న కాఫీడే అధినేత సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న వార్త సంచలనం సృష్టించింది. ప్రపంచమంతా ఒక్కసారిగా ఎవరీ సిద్ధార్థ ఎందుకిలా చేశాడన్న ప్రశ్నలతో ఆసక్తి ప్రదర్శించింది. సిద్దార్థ ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలనుకునే నాటికి కాఫీడే దేశవ్యాప్తంగా 243 పట్టణాల్లో, 1700 బ్రాంచీలుగా విస్తరించి ఉంది. ఈ విస్తరణ వెనక 28 ఏళ్ళ పరిశ్రమ ఉంది. భారత్‌లోనే కాకుండా ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్, మలేసియా, నేపాల్‌లలో కూడా కాఫీడే వేళ్ళూనుకుంది.

అయితే ఈ ఏడాది జూన్‌ నాటికి దేశంలో 280 కాఫీడేలు మూతపడ్డాయి. రూ.2800 కోట్ల అప్పులు మిగిలాయి. ఏ సంస్థకైనా ఉత్తాన పథనాలు సాధారణం. అయితే కాఫీడేను తన కలల పంటగా సంరక్షిస్తూ వచ్చిన సిద్ధార్థ ఎక్కడ పట్టు కోల్పోయాడు? ఎక్కడ అతని లెక్క తప్పింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదకడానికి చాలా టైమ్‌ ఉంది. మొదట ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దాలి అనుకుంది మాళవిక.

వాస్తవానికి ఈ అప్పు తీర్చడానికి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. అమ్మకానికి పెట్టవచ్చు. కానీ తమ సంస్థను నమ్ముకున్న ఉద్యోగులకు మాత్రం సమాధానం చెప్పడానికి ఉండదు. సిద్దార్థ తను కన్న కలలు కల్లలుగా మారిపోతాయి. ఎందుకో మాళవికకు ఇది సరికాదనిపించి మరో మార్గం అన్వేషిస్తోంది. ఎలాగైనా ఈ అప్పుల నుంచి సంస్థను గట్టెక్కించి మళ్ళీ లాభాల బాట పట్టించాలని నడుం బిగించింది. కాఫీడే ఎంటర్‌ప్రైజస్‌ లిమిటెడ్‌లోని కొన్ని నిధులను మళ్ళించాలని వ్యూహం రచిస్తోంది. ఈ సంస్థ అనుబంధంగానే కాఫీడే అవతరించింది. ఇంతకూ సిద్దార్థకు కాఫీడే ఆలోచన ఎలా వచ్చిందో?

సిద్దార్థకు వారసత్వంగా వచ్చిపడిన కాఫీతోటలున్నాయి. మంగళూర సెయింట్‌ అలోయ్సియస్‌ కాలేజీ నుంచి పొందిన ఎకనమిక్స్‌ మాస్టర్‌ డిగ్రీ ఉంది. ఓ రోజు మాళవికతో మనం కాఫీ షాప్‌ పెడదాం.. కప్పు కాఫీ ఇరవైఅయిదుకు అమ్మితే లాభాలొస్తాయి’ అన్నాడు. అయితే మాళవికకు ఎందుకో అంతగా నచ్చలేదు. అంత చక్కని ఆలోచనైతే కాదని చెప్పింది. తను కూడా బెంగళూరు యూనిర్శిటీ నుంచి ఇంజనీర్‌ పట్టా పుచ్చుకుంది మరి. ఈ ఘటన 1990లో జరిగింది. అప్పట్లో కాఫీ అయిదురూపాయలకే దొరికేది. మరి ఎంత అత్యద్భుతంగా ఉందన్నా ఇరవైఅయిదు రూపాయలకు ఎవరు కొంటారన్నదే ఆమె కామన్‌సెన్స్‌ వాదన. సిద్దార్థ మళ్లీ ఆలోచనలో పడ్డాడు.

కొన్ని రోజులు తర్వాత ‘కాఫీతో పాటు నెట్‌ సర్ఫింగ్‌ ఉంటే...’అర్ధోక్తిగా ఆపాడు. మాళిక మరో మాట లేకుండా ఓకే గుడ్‌ అంది. సరిగా అయిదేళ్ల తర్వాత బెంగళూరు బ్రిగేడ్‌ రోడ్డులో కెఫేకాఫీడే ప్రారంభించారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యురాలిగా రూపాయి జీతం ఆశించకుండా అడుగు ముందుకేస్తోంది. సంస్థ ప్రారంభం నుంచి మాళవిక పైసా జీతం ఆశించకుండా శ్రమిస్తోంది.

క్రమంగా ఆరు దేశాల్లో ఏడాదికి రమారమి వందకోట్లకుపైగా కాఫీ కప్పులు విక్రయించే స్థితికి ఎదిగింది. దేశవిదేశాల్లో బ్రాంచీలు, వేలల్లో ఉద్యోగులు...అంతా సూపర్‌గా కనిపించే వేళలో అనుకోని ఉత్పాతం సిద్ధార్థ ఆత్మహత్య రూపంలో తాకింది. ఆ దెబ్బకు ఒక్కసారిగా కాఫీడే కకావికలమై పోయింది. అనకొండలా పేరుకుపోయిన అప్పులు బైటపడ్డాయి.

ఇప్పుడు కాఫీడే రోజుకు పదిహేను వేల కప్పులు అందించేంతగా పడిపోయింది. ఒకవైపు కడదాకా నడవాల్సిన భర్త కనుమూత.. మరోవైపు తమ కలల సౌధం కూలిపోతున్న వెత. ఈ చీకటిలో మాళవిక వద్ద వెలుగుతున్నది ఒక్కటే ఆత్మవిశ్వాసం. కాఫీడే కేవలం సంస్థగానే కాకుండా తమ జీవితంతో పెనవేసుకుపోయిన ఓ ఎమోషన్‌ బాండింగ్‌ అని మాళవిక అంటారు. ఎలాగైనా సరే కాఫీడేను మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ప్రయత్నానికి ఇద్దరు కొడుకులు కుడిఎడమలుగా కదులుతున్నారు.

సిద్దార్థ మాళవికలకు మొక్కలు నాటడం అలవాటు. మూడువేలకు పైగా మొక్కలు నాటారు. అదే స్పూర్తితో నేలకూలిన వటవృక్షం స్థానంలో మళ్ళీ కొత్తగా కాఫీడే మొక్కను నాటేందుకు మాళవిక సిద్ధమవుతోంది. అది మొక్కగా కాదు తమ కలల రూపంగా.. సిద్ధార్థ ఆశల ఆశయాల అంతరాత్మగా !

Next Story