ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీతో జ‌న‌సేన పొత్తు ఆలోచ‌న శుభప‌రిణామమ‌ని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నికల్లోనే పొత్తు పెట్టుకుని ఉంటే గాజువాక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌చ్చితంగా గెలిచేవార‌ని ఆయ‌న అన్నారు. కాగా, బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య మ‌రోసారి పొత్తు కుద‌ర‌బోతుంద‌ని, అందుకు సంబంధించిన కీల‌క భేటీ ఈ రోజు విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నుంద‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేసేందుకు ఇప్ప‌టికే రంగం సిద్ధ‌మైన‌ట్టుగా తెలుస్తుంది.

ఇదిలా ఉండ‌గా జ‌న‌సేన‌తో పొత్తుపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణ‌కుమార్ రాజు మీడియాతో మాట్లాడారు.త‌మ పార్టీ విధి విధానాలు, జ‌న‌సేన విధి విధానాలు రెండూ చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. సాధార‌ణ ఎన్నిక‌ల్లో వేర్వేరుగా పోటీ చేయ‌డం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ఎవ‌రి బ‌లాలు ఏంట‌న్న‌ది ప్ర‌జ‌లు ఓట్ల రూపంలో తీర్పునిచ్చారు. క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం అన్న‌ట్టు ఇప్పుడు క‌లిస్తే రెండు పార్టీల‌కు క‌చ్చితంగా చాలా ఉప‌యోగం ఉంటుందన్నారు విష్ణుకుమార్‌రాజు.

బీజేపీ, జ‌న‌సేన పొత్తు కేవ‌లం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతుందా..? లేక భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లోనూ కొన‌సాగుతుందా..? అన్న ప్ర‌శ్న‌ల‌పై విష్ణుకుమార్‌రాజు స్పందిస్తూ త‌న‌కు తెలిసినంత వ‌ర‌కు లోక‌ల్ ఎల‌క్ష‌న్స్‌లో కేంద్ర పార్టీ పెద్ద‌ల జోక్యం ఉండ‌ద‌ని, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్ర‌స్థాయి నాయ‌క‌త్వ‌మే నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. క‌నుక భ‌విష్య‌త్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో పొత్తుపై బీజేపీ అగ్ర నేత‌లు క‌లిసి నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోద అంశంలో కేంద్రం అన్యాయం చేసిందంటూ బీజేపీని చాలా సార్లు విమ‌ర్శించిన నేప‌థ్యంలో మ‌ళ్లీ కుద‌ర‌నున్న ఈ పొత్తు ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త కుదుర్చుతుంద‌ని మీరు భావిస్తున్నారా..? అన్న ప్ర‌శ్న‌కు విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ తామేమీ గ‌తంలో ఎన్న‌డూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను, ఆయ‌న అభిమానుల‌ను ఎన్న‌డూ విమ‌ర్శించ‌లేద‌ని, వారికి తామేమీ వ్య‌తిరేకం కాద‌న్నారు. బీజేపీకి ఒక వ‌ర్గ‌మో లేక పార్టీల ప‌రంగా పోరాట‌మో ఉండ‌దు. అందుకు నిద‌ర్శ‌నం 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లేన‌ని గుర్తు చేశారు విష్ణుకుమార్ రాజు.

రెండు పార్టీల‌కు లాభం..

అలాగే, బీజేపీలో జ‌న‌సేనను విలీనం చేయాలంటూ అమిత్ షా ప్ర‌తిపాదించిన‌ట్టుగా తెలుస్తుంద‌ని, ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో పొత్తుకే ప‌రిమిత‌మ‌వుతారా..? లేక విలీన ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అటువంటి విష‌యాలు నా స్థాయి వంటి వ్య‌క్తుల‌కు తెలిసేవి కావు. ఆ నిర్ణ‌యాల‌న్నీ పార్టీ అగ్ర‌నేత‌లు తీసుకుంటారు. నా ఆలోచ‌న మేర‌కు ప్ర‌స్తుతానికి పొత్తు ఉంటుంద‌వి. భ‌విష్య‌త్తులో పార్టీ ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయ‌న్న‌ది వేచి చూడాల్సి ఉంది అంటూ విష్ణుకుమార్ రాజు త‌న అభిప్రాయాన్ని చెప్పారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ ఈ పొత్తు వ‌ల్ల బీజేపీ, జ‌న‌సేన‌ రెండు పార్టీల‌కు లాభం ఉంద‌ని, లేక‌పోతే ఎన్నిక‌ల్లో రెండు పార్టీల‌కు సీట్లు లేకుండాపోయే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ఈ ప‌రిణామం రెండు పార్టీల‌కు క‌లిసొచ్చే అంశం. ప్ర‌స్తుతానికి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వ‌ర‌కే రెండు పార్టీలు పొత్తు ఆలోచ‌న చేస్తున్నాయి. ఈ పొత్తు ఇలానే కొన‌సాగితే భ‌విష్య‌త్తులో మంచి ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న‌ది నా భావ‌న‌. ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నున్న బీజేపీ, జ‌న‌సేన కీల‌క నేత‌ల భేటీలో స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని విష్ణుకుమార్ రాజు చెప్పారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.