జగనన్న చేదోడు పథకం.. వారి ఖాతాల్లో రూ. 10 వేలు
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2020 9:29 AM ISTకరోనా కష్టకాలంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు సీఎం జగన్. తాజాగా మరో పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేడు జగనన్న చేదోడు పథకాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రారంభించనున్నారు.
వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారడిపడి జీవనం సాగిస్తోన్న వారందరికి ఈ చేదోడు పథకం ఆసరా నిలుస్తుంది. షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, లాండ్రీ షాపు ఉన్న రజకులకు, టైలరింగ్ షాపులున్న దర్జీలకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. 2,47,040 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. వీరిని ఆదుకునేందుకు రూ.247 కోట్ల 40 లక్షలు విడుదల చేస్తూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. లబ్దిదారులు వారి వృత్తికి అవసరమైన పనిముట్లు, పెట్టుబడి కోసం ఈ ఆర్థికసాయాన్ని ప్రకటించింది ప్రభుత్వం. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడి లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు.