ఏపీలో షూటింగ్‌లకు అనుమతి
By తోట వంశీ కుమార్ Published on 9 Jun 2020 6:10 PM ISTఆంధ్రప్రదేశ్‌లో జూలై 15వ తేదీ నుంచి షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారని టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పలువురు మంగళవారం ఏపీ సీఎం జగన్‌కు ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సి.కల్యాణ్, సురేశ్ బాబు, తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. జగన్‌తో భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు.
'ఏడాదికాలంగా సీఎం జగన్‌ను కలవాలనుకున్నాం. కరోనాకారణంగా షూటింగ్ లేక ఇబ్బందిపడ్డాం. విశాఖలో స్టూడియోకు వైఎస్సార్ హయాంలో భూమి ఇచ్చారు. ఆ భూమిలో పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఏపీలో కూడా సినిమా షూటింగ్‌లకు సీఎం జగన్ అనుమతిచ్చారు. థియేటర్లు మినిమం ఫిక్స్‌డ్ ఛార్జీలు ఎత్తివేయాలని సీఎం జగన్‌ను కోరాం. టికెట్ల ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరాం. మా ప్రతిపాదనలను పరిశీలిస్తామని జగన్ మాకు హామీఇచ్చారు. ఏపీలో జూలై 15 తరువాత షూటింగ్‌లకు అనుమతి ఇచ్చారు' అని చిరంజీవి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మంత్రి పేర్ని నానితో సమన్వయం చేసుకోవాలని సూచించారని తెలిపారు.