మహమ్మారిపై జగన్ సర్కారు యాక్షన్ ప్లాన్ ఇదేనట

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Jun 2020 7:56 AM GMT
మహమ్మారిపై జగన్ సర్కారు యాక్షన్ ప్లాన్ ఇదేనట

యావత్ ప్రపంచాన్ని వణికించి.. తాజాగా భారత్ లో అంతకంతకూ విస్తరిస్తున్న మాయదారి మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశంలోని ఒక్కో రాష్ట్రం ఒక్కోలా వ్యవహరిస్తోంది. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఒక పద్దతి ప్రకారం పోరు చేస్తోందిన ఏపీ సర్కారు. మహమ్మారిని డీల్ చేసే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.తమ రాష్ట్రం నుంచి బయటకు వెళ్లే వారి విషయంలోనూ.. తమ రాష్ట్రానికి వచ్చే వారి విషయంలో ఏపీ కఠినంగా వ్యవహరిస్తే.. తెలంగాణ సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరించిందని చెప్పాలి.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వ్యత్యాసాలు రెండు రాష్ట్రాల మధ్య కనిపిస్తాయి. ఇదిలా ఉంటే.. రోజురోజుకీ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఏపీ సర్కారు యాక్షన్ ప్లాన్ ఏమిటో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మాయదారి రోగం వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదన్న ధైర్యాన్ని కలిగించేలా పెద్ద ఎత్తున ప్రచారాన్ని షురూ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

మాయదారి రోగ లక్షణాలు కనిపిస్తే ఏమేం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలన్న విషయం మీద టీవీ.. పత్రికల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. పాజిటివ్ వచ్చిన వారికి జాగ్రత్తలతో పాటు.. వారు ధైర్యంగా ఉండాలన్న విషయాన్ని ప్రజలందరికి అర్థమయ్యేలా ప్రచారం చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు సరిహద్దుల్లో ఎక్కువసేపు ఉండకుండా వెంటనే వెళ్లిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆరు రాష్ట్రాలనుంచి వస్తున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు.

ఏపీలో ఇప్పటివరకూ 4.54 లక్షల శాంపిల్స్ తీస్తే అందులో 4,659 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా ఏపీ ముఖ్యమంత్రి దృష్టికి వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాల కల్పనకు.. కొత్తగా 16 బోధనాసుపత్రులకు.. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయటం కోసం రూ.16వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న వైనాన్ని జగన్ చెప్పుకొచ్చారు. ఓవైపు కేసులు పెరుగుతున్న వేళ.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తామెంత పక్కాగా ప్రిపేర్ అయ్యామన్న విషయాన్ని ఏపీ సీఎం చాలా స్పష్టంగా చెబుతున్నారని చెప్పాలి.

Next Story
Share it