జూలై 8న సీఎం జగన్ మరో కొత్త పథకానికి శ్రీకారం
By సుభాష్ Published on 4 July 2020 1:55 AM GMTజూలై 8వ తేదీన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పేదలందరికి ఇళ్లు పథకానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. అలాగే చెరకు రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సహకార రంగంలోని షుగర్ ఫ్యాక్టరీల పునరుద్దరణపై సమీక్ష సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. రాష్ట్రంలో సహకార షూగర్ ఫ్యాక్టరీల పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలపై సీఎం ఆరా తీశారు.
అయితే ప్రస్తుతం సహకార చక్కెర కర్మాగారాల వద్ద ఉన్న నిల్వలను ప్రభుత్వపరంగా ఎంత వరకు వినియోగించుకోవాలనే విషయంపై ఆలోచించాలని అన్నారు. అలాగే రైతులకు బకాయిలు లేకుండా తీర్చడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చెరకు రైతులకు రూ.54.6 కోట్లు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. అది కూడా జూలై 8న చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని గత శుక్రవారం జరిగిన సమావేశంలో అధికారులను ఆదేశించారు. జగన్ నిర్ణయంతో దాదాపు 15వేల మంది రైతులకు మేలు జరగనుంది.
శ్రీవిజయరామ గజపతి ఫ్యాక్టరీ కింద రూ. 8.41 కోట్లు, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రూ.22.12 కోట్లు, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కింద రూ.10.56 కోట్లు, తాండవ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రూ.8.88కోట్లతో పాటు అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ రైతులకు రూ.4.63 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. అంతేకాకుండా సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలపై మరింత లోతుగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆగస్ట్ 15 నాటికి సమగ్రమైన నివేదికలు తయారు చేసి ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.