‘అంబులెన్సు’ కలర్ ప్రొటోకాల్ ను జగన్ సర్కారు లైట్ తీసుకుందా?

By సుభాష్  Published on  3 July 2020 10:00 AM GMT
‘అంబులెన్సు’ కలర్ ప్రొటోకాల్ ను జగన్ సర్కారు లైట్ తీసుకుందా?

ప్రభుత్వం తాను చేపట్టిన పథకాల్ని ప్రజల మనసుల్లో నిలిచేలా చేయాలనుకోవటం తప్పేం కాదు. ఈ క్రమంలో నిబంధల్ని పట్టించుకోకుండా పోవటం.. అనవసరమైన తలనొప్పుల్ని తెచ్చుకోవటమేనని చెప్పాలి. ఆ మధ్యన ఏపీలోని స్థానిక సంస్థల భవనాలకు వేసిన రంగులపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగటమేకాదు.. చివరకు కోర్టులు కల్పించుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా రోడ్ల మీదకు తీసుకొచ్చిన సరికొత్త 108 అంబులెన్సు వాహనాలకు వేసిన రంగుల మీద కొత్త రచ్చ మొదలైంది.

భారీ ఎత్తున.. ఒకేసారి వందల్లో అంబులెన్సుల్ని రోడ్ల మీదకు తీసుకురావటం.. గ్రాండ్ గా ఓపెన్ చేయటంతో విపక్షాల నోట మాట రాని పరిస్థితి. చివరకు విపక్ష నేత చంద్రబాబు స్పందిస్తూ.. తమ ప్రభుత్వ హయాంలోనూ 1800 అంబులెన్సుల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. కొత్తగా తెచ్చిన అంబులెన్సులు ఎలాంటి ప్రభావాన్ని చూపించాయన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

విజయవాడలో జరిగిన భారీ కార్యక్రమంలో ఒకేసారి వందలాది 104.. 108 వాహనాల్ని రోడ్ల మీదకు తీసుకురావటం.. ఆ సీన్ చూస్తే.. సినిమాల్లో తప్పించి విడిగా అలాంటి కార్యక్రమం కనిపించదని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంబులెన్సుల అవసరం పెద్ద ఎత్తున ఉంది. సరిగ్గా సమయానికి సరిపోయేలా అంబులెన్సులు రావటం ఏపీ ప్రజల్లో కొత్త ఊరటగా ఉంటుందని చెప్పక తప్పదు.

ఇలాంటివేళ.. వాహనాలకు వేసిన రంగులపై విపక్షాలు విరుచుకుపడటం మొదలెట్టాయి. అంబులెన్స్‌లకు వేసే రంగుల విషయంలో నిబంధనల్ని పాటించలేదని.. ప్రోటోకాల్ కు సంబంధం లేకుండా తమకెంతో ఇష్టమైన నీలి రంగును పులిమారని ఆరోపిస్తున్నారు. 108 వాహనాల విషయంలో నేషనల్ అంబులెన్స్ కోడ్ ను పాటించలేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే కొన్ని నిబంధనల్ని చూపిస్తున్నారు. ఆ రూల్స్ ను జగన్ సర్కారు పాటించలేదని చెబుతున్నారు. అవేమంటే..?

- అంబులెన్స్ బయట వైపు.. డ్రైవర్ క్యాబిన్ భాగం వరకు ఎరుపు - పసుపు లేదంటే ఎరుపు - సిల్వర్ వర్ణాలతో ఎరుపు చదరాలు ఉండాలి. అయితే.. వాటిని ఎరుపు.. నీలంలో వేశారు. పసుపును మిస్ చేశారు.

- వాహనం ముందూ.. వెనుక డోర్లకు తెలుపు.. ఎరుపు పట్టీలను ఏటవాలుగా వేయాలి. కానీ.. డోర్ కు వేశారు కానీ.. ముందు అలాంటి పట్టీలు లేవు.

- బాబు హయాంలో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఏపీ నుంచి ఎంపికైన వేళ.. తన ఎంపీ నిధులతో జిల్లాకు ఒకటి చొప్పున 13 అంబులెన్సుల్ని ఇచ్చారు. కోడ్ ప్రకారం రంగులు వేసినా.. వాహనాల మీద సురేశ్ ప్రభు.. చంద్రబాబుల ఫోటోలు వేశారు. నిబంధనలకు విరుద్ధం కావటంతో వాటిని తొలగించారు.

- అంబులెన్సు బయట భాగానికి స్వచ్ఛమైన తెలుపు రంగును వేయాల్సి ఉంటుంది. కానీ.. కొత్త 108వాహనాలకు ముదురు నీలం రంగు వేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం.

- డ్రైవర్ ముందుండే అద్దం కింది భాగంగా ఆంగ్ల అక్షరాలతో పసుపు రంగు మీద ఎర్ర అక్షరాలతో అంబులెన్స్‌ అని మిర్రర్ ఇమేజ్ లో రాయాలి. దీంతో.. ముందెళ్లే వాహనాలకు అర్థమవుతుంది. అందుకు భిన్నంగా తాజా వాహనాలకు విండ్ షీల్డ్ మీద రాశారు.

- అంబులెన్సుల మీద ఎవరి ఫోటోలు ఉండకూడదు. 2005లో రాజీవ్ బొమ్మ వేశారు. తర్వాత ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ బొమ్మ వేస్తే. దాన్ని కోర్టు ఆదేశాలతో తొలగించారు. కిరణ్ ఫోటో స్థానంలో జాతీయ పతాకం బొమ్మ వేశారు. తాజా వాహనాల మీద జగన్.. వైఎస్ ఫోటోల్ని లోగోల మాదిరి వేశారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story
Share it