తాజా జీవోతో షాకిచ్చిన జగన్ సర్కార్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2020 7:16 AM GMT
తాజా జీవోతో షాకిచ్చిన జగన్ సర్కార్

ఏ చిన్న అవకాశం చిక్కినా వదిలిపెట్టకుండా చికాకులు పెట్టే ప్రతిపక్షాలకు నోట మాట రాని విధంగా తాజా నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ సర్కారు. ఎన్నికలవేళ.. మేనిఫెస్టోలో పేర్కొన్న రీతిలో మద్యపానాన్ని క్రమపద్దతిలో తగ్గిస్తామన్న మాటను నిలబెట్టుకునే రీతిలో నిర్ణయం ఉండటం విశేషం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయమే రాష్ట్ర ప్రభుత్వాలకు అసరాగా మారింది. దీంతో.. చాలా రాష్ట్రాలు మద్యం అమ్మకాల ద్వారా ఎంత కుదిరితే అంత ఎక్కువ ఆదాయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి.

దీనికి భిన్నంగా ఏపీ సర్కారు తాజా నిర్ణయం ఉంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల్ని పెద్ద ఎత్తున తగ్గిస్తూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి అమల్లోకి రానున్న దీని ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఉన్న షాపుల సంఖ్య వందల్లో తగ్గున్నాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. తమ పాలసీ ప్రకారం.. అప్పటికి ఉన్న మద్యం దుకాణాల్లో 20 శాతాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రైవేటు వ్యక్తులకు మద్యం అమ్మకాలకు లైసెన్సులు ఇచ్చే దానికి బదులుగా ప్రభుత్వమే సొంతంగా అమ్మేలా ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ ఏపీలో ఉన్న 3500 మద్యం దుకాణాలకు 535 షాపుల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు మద్యం దుకాణాల సంఖ్య 2965కు తగ్గనున్నాయి. తాజా నిర్ణయంతో ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొత్తం 33 శాతం మద్యం షాపుల్ని తగ్గించినట్లైంది.

ఇంతకీ ఈ తగ్గించిన షాపులన్ని ఏయే జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయన్నది చూస్తే.. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లోనూ ఉండటం గమనార్హం. మద్య నిషేధం తమ లక్ష్యమని చెప్పే జగన్ ప్రభుత్వ మాటలకు తగ్గట్లే చేతల్లో కనిపించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఇలాంటి నిర్ణయాన్ని ఏ మాత్రం ఊహించలేని తెలుగు తమ్ముళ్లకు ప్రభుత్వ తాజా నిర్ణయం గొంతులో వెలక్కాయ పడేలా చేయటం ఖాయం. మాట తప్పని ప్రభుత్వంగా చెప్పుకునే జగన్ మాటలకు తగ్గట్లే తాజా నిర్ణయం ఉందని చెప్పక తప్పదు.

Next Story