6 నుంచి 9వ తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
By సుభాష్ Published on 26 March 2020 2:38 PM ISTకరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలు అప్రమత్తమై ఎన్నో చర్యలు చేపట్టింది. కరోనాను తరిమికొట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా లాక్‌డౌన్ ప్రకటించాయి. ఇక ఏపీలోనూ గట్టి చర్యలు చేపడుతోంది జగన్ సర్కార్. విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమాహాళ్లు, తదితర షాపులను సైతం ముందుగానే మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.
కాగా, తాజాగా 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేది లేదని మంత్రి ఆదిమూల సురేష్ తెలిపారు. వారందరినీ పై క్లాసులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి పరీక్షలు నిర్వహించేది లేదని చెప్పారు. అలాగే పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్నది తాము చెప్పలేమని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం సరుకులను వారి ఇళ్లకే పంపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.