పీఎస్‌ఎల్‌వీ సీ-48 రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం..!

By అంజి  Published on  10 Dec 2019 11:50 AM IST
పీఎస్‌ఎల్‌వీ సీ-48 రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం..!

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. దేశ సరిహద్దులో నిఘాను పెంచేందుకు రీశాట్‌-2,బీఆర్‌1 శాటిలైట్‌ను రేపు శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు ముమ్మరం చేశారు. సతీష్‌ ధవన్‌ స్పేస్‌లోని మొదట ప్రయోగ వేదిక నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ48 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. కాగా ఇవాళ మధ్యాహ్నం 1.25 గంటల నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ48కు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ -సీ48 నింగిలోకి దూసుకెళ్లనుంది. సోమవారం ఉదయం శాటిలైట్‌ రిహార్సల్‌ను విజయవంతంగా నిర్వహించారు.

మరో వైపు ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ-సీ48 రాకెట్‌ నమునాను శ్రీవారి పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివన్‌ మాట్లాడుతూ.. పీఎస్‌ఎల్‌వీ సీ రాకెట్‌కు ఇది 50 ప్రయోగమని అన్నారు. రేపు నిర్వహించే ప్రయోగం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగమని శివన్‌ పేర్కొన్నారు. రీశాట్‌-2,బీఆర్‌1 తో మొత్తం 10 శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపనున్నారు. రేపటి ప్రయోగంతో పీఎస్‌ఎల్‌వీ సీ రాకెట్‌ అర్థసెంచరీ పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాల్లో రెండు మాత్రమే విఫలం కావడం గమనార్హం. శ్రీకాళహస్తి, సూళ్లురుపేట చెంగాళమ్మ ఆయలంలో కూడా శివన్‌ పూజలు చేస్తారని సమాచారం. ఇవాళ సాయంత్రం ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ శ్రీహరికోటకు రానున్నారు.

Shivan

న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ అనే కమర్షియల్‌ విభాగాన్ని ఇస్రో కొత్తగా ఏర్పాటు చేసుకుంది. ఎన్‌ఎస్‌ఐల్‌ విభాగం ఆయా దేశాలతో శాటిలైట్ల ప్రయోగం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా మొత్తం 9 విదేశీ శాటిలైట్లను నింగిలోకి పంపించేందుకు ఇస్రో సిద్ధమైంది. రేపు నిర్వహించే ఈ ప్రయోగం 16 నిమిషాల్లో పూర్తి కానుంది. భూమి నుంచి 576 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలో రిశాట్‌-2 బీఆర్‌1 శాటిలైట్‌ను పీఎస్‌ఎల్‌ వీ -సీ48 రాకెట్‌ చేర్చనుంది. ఆ తర్వాత వరుసగా విదేశీ శాటిలైట్లను కక్ష్యలోకి చేర్చనుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పటి వరకూ 310 విదేశీ శాటిలైట్లను నింగిలోకి చేర్చింది. అమెరికాకు చెందిన తైవాక్-‌0129, 1 హాప్‌ శాట్‌తో పాటు నాలుగు మల్టీ మిషన్‌ లెమూరు శాటిలైట్లు, ఇజ్రాయెల్‌కు చెందిన రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ డఛీఫ్యాట్‌-3, జపాన్‌కు చెందిన రాడార్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌ క్యూపీఎస్‌, ఇటలీకి చెందిన సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ శాటిలైట్లను నింగిలోకి పంపనున్నారు.

Next Story