ఒలింపిక్స్ కి ముందు రష్యాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించాలని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) సిఫార్సు చేసింది. మాస్కోలోని ల్యాబోరేటరీల్లో నామమాత్రపు డోపింగ్‌ పరీక్షలు, నకిలీ నివేదికలు, నిర్వహణ తీరుపై విచారించిన వాడా ఆ మేరకు నిషేధాన్ని సూచించింది. దీంతో అంతర్జాతీయ క్రీడల్లో మరో నాలుగేళ్ల పాటు రష్యా అథ్లెట్లు కనిపించకపోయే అవకాశం ఉంది. దీంతో వచ్చే ఏడాది జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌తోపాటు 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో కూడా రష్యా పాల్గొనే అవకాశం లేదు.

స్విట్జర్లాండ్ లోని లాసాన్‌లో సోమవారం సమావేశమైన వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ దీనిపై విచారించింది. రష్యాలో విచ్చలవిడిగా డోపింగ్ ను ప్రోత్సహించారని పేర్కొంది. అంతేకాకుండా రష్యన్ డోపింగ్ నిరోధక సంస్థ తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కూడా సహకరించలేదని వెల్లడించింది. ఈక్రమంలో వచ్చే నాలుగేళ్లపాటు అన్ని అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనకుండా రష్యాను నిషేధించారు. సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయానికి అన్నివైపుల నుంచి ఏకగ్రీవ మద్దతు లభించినట్టుగా తెలుస్తోంది.అయితే వచ్చే ఏడు జరిగే యూరోపియన్‌ సాకర్‌ చాంపియన్‌షిప్ లో మాత్రం రష్యా పాల్గొనవచ్చు. కారణం..ఆ టోర్నీ ఆతిథ్య దేశాలలో రష్యా ఒకటి కావడం. ఇక ఒలింపిక్స్‌లో తటస్థ అథ్లెట్లుగా రష్యా ఆటగాళ్లు పాల్గొనవచ్చు. కాకపోతే..తాము డ్రగ్స్‌ వాడలేదని వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు నిషేధంపై అప్పీలు చేసుకునేందుకు రష్యాకు వాడా 21 రోజుల గడువునిచ్చింది.

నిజానికి వాడా నిబంధనలను రష్యా ఉల్లంఘించింది అన్న ఆరోపణలు గత కొన్ని సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. రష్యన్ డోపింగ్ నిరోధక సంస్థ తానే స్వయంగా అథ్లెట్ లను డోపింగ్ కు ప్రోత్సహించిందని గతంలో పలు కమిటీలు నివేదికలు అందించాయి. దీనితో 2015 లోనే రష్యాను అంతర్జాతీయ పోటీల నుంచి బహిష్కరించారు. అయితే సరైన నివేదిక ఇస్తామని రుసాడా హామీ ఇవ్వడంతో 2018లో ఆంక్షలను పాక్షికంగా సవరించారు. అయితే 2019 జనవరిలో రష్యా అందచేసిన నివేదికలు తప్పులతడక గా ఉండడంతో ఇప్పుడు వాడా ఈ నిర్ణయం తీసుకుంది.

జ్యోత్స్న భాస్కరభట్ల

Next Story