ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధం, దేశీయంగా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ ఇప్పుడు మరో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదే గోధుమల కొరత కారణంగా ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) నివేదిక ప్రకారం.. ఈ ఏడాది పాకిస్థాన్‌లో గోధుమల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 2.2 మిలియన్ల టన్నుల మేర తగ్గిపోనుందని అంచనా.
పాకిస్థాన్‌లో గోధుమ పిండితో చేసే రొట్టె, నాన్, బ్రెడ్ వంటివి ప్రజల ప్రధాన ఆహారం. ఉత్పత్తి భారీగా తగ్గితే దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడనుంది. తీవ్రమైన కరువు, తగినంత వర్షపాతం లేకపోవడం దీనికి ప్రధాన కారణం. 2025 ప్రారంభంలో సగటు కంటే 39% తక్కువ వర్షపాతం నమోదు కావడంతో.. గోధుమలు పండించే విస్తీర్ణం 10.37 మిలియన్ హెక్టార్ల నుంచి 9.1 మిలియన్ హెక్టార్లకు పడిపోయింది. పాకిస్థాన్‌లో గోధుమ పిండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం అక్కడ 10 కేజీల పిండి బస్తా రూ. 890 నుంచి రూ. 1,500 పైనే పలుకుతుండగా, 20 కేజీల బస్తా రూ. 1,780 నుంచి రూ. 1,885 వరకు అమ్ముడవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధం కారణంగా 'ఖైబర్ పఖ్తుంఖ్వా' లాంటి ప్రధాన గోధుమ ఉత్పత్తి ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతింది. దీనికి తోడు సింధు జలాల ఒప్పందం విషయంలో ఉద్రిక్తతల కారణంగా పంజాబ్ ప్రాంతంలో సాగునీటి కొరత కూడా ఈ గోధుమ సంక్షోభానికి మరో కారణమని నిపుణులు చెబుతున్నారు.