భారత్ లో తయారైన వ్యాక్సిన్ లను వాడుకుంటోంది బ్రిటన్. అదే వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్ ను అభివృద్ధి చేసింది బ్రిటన్ సంస్థలే అయినా భారత్ లో తయారు చేసి బ్రిటన్ కు పంపిస్తూ వస్తున్నారు. ఇప్పటికే అరకోటి కొవిషీల్డ్ డోసులను బ్రిటన్ కు అందించింది భారత్. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారతీయులకు క్వారంటైన్ విధిస్తూ బ్రిటన్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. భారత్‌లో కోవిషీల్డ్ రెండు డోస్‌ల తీసుకుని తమ దేశానికి వచ్చే ప్రయాణికులను వ్యాక్సిన్ వేసుకోనివారిగానే పరిగణిస్తామని, వీరు 10 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని యూకే ప్రకటించింది.
దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇది వివక్ష తప్ప మరొకటి కాదని స్పష్టం చేసింది. పూర్తిగా వివక్ష పూరితమైన విధానం అని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో చెప్పుకొచ్చింది. భారత్ నుండి పంపిన వ్యాక్సిన్లకు అక్కడి ప్రజలకు వినియోగించారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడదే కొవిషీల్డ్ ను బ్రిటన్ గుర్తించకపోవడాన్ని వివక్షగానే భావిస్తామని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉపసంహరించుకోకపోతే తమ నుంచి తీవ్ర ప్రతిచర్యను చవిచూడాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించింది. అక్టోబర్ 4 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలపై భారత్ ఆందోళనల గురించి బ్రిటిష్ హై కమిషన్ ప్రతినిధి స్పందించారు. సాధ్యమైనంత త్వరగా అంతర్జాతీయ ప్రయాణాలను ప్రారంభించడానికి యూకే కట్టుబడి ఉందని అంటోంది.