పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పెను ప్రమాదం తప్పింది. లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వెళ్తున్న ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్‌లోని ఓ వాహనం శనివారం నాడు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఖాన్ కారు సురక్షితంగా ఉంది. ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్ ఇస్లామాబాద్‌కు బయలుదేరింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి చెందిన ఇమ్రాన్ ఖాన్ శనివారం మధ్యాహ్నం తోషాఖానా కేసు విచారణ కోసం కోర్టులో హాజరు కావడానికి ఇస్లామాబాద్‌కు బయలుదేరినప్పుడు అతని కాన్వాయ్‌లోని ఒక వాహనానికి ఈ ప్రమాదం జరిగింది. కారు ఏకంగా పల్టీలు కొట్టేసింది. జియో న్యూస్ నివేదించిన ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్‌కు వెళ్ళిన కొన్ని గంటల తర్వాత, పంజాబ్ పోలీసులు ఇమ్రాన్ ఖాన్ జమాన్ పార్క్ నివాసంలోకి ప్రవేశించి 20 మందికి పైగా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు.
ఇమ్రాన్ ఖాన్ కు జారీ చేసిన నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్లను పాకిస్థాన్ హైకోర్టు ఈనెల 18వ తేదీ వరకూ సస్పెండ్ చేసింది. గత ఏప్రిల్‌లో ప్రధాని పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఇమ్రాన్ ఖాన్ తోషఖానా కేసు, టెర్రరిజం కేసు, మహిళా జడ్జిని బెదిరించిన కేసుతో సహా పలు లీగల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన బహుమతులు చట్టవిరుద్ధంగా అమ్ముకున్నారనే ఆరోపణలపై మార్చి 18వ తేదీన ఇస్లామాబాద్ కోర్టుకు ఆయన హాజరుకావలసి ఉంది.