10 మిలియన్ డాలర్ల విలువైన విగ్రహాలను భారత్ కు అప్పగించిన అమెరికా

భారతదేశానికి చెందిన 1400 పురాతన శిల్పాలను అమెరికా తిరిగిచ్చింది. వీటి విలువ 10 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

By Medi Samrat  Published on  16 Nov 2024 9:15 PM IST
10 మిలియన్ డాలర్ల విలువైన విగ్రహాలను భారత్ కు అప్పగించిన అమెరికా

భారతదేశానికి చెందిన 1400 పురాతన శిల్పాలను అమెరికా తిరిగిచ్చింది. వీటి విలువ 10 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విగ్రహాలను పలు సందర్భాల్లో భారత్ నుండి దొంగిలించి విదేశాలకు తరలించారు. మొత్తం 1,440 పురాతన వస్తువులను మాన్‌హట్టన్ ప్రాసిక్యూటర్ ఆల్విన్ బ్రాగ్ భారతదేశానికి తిరిగి ఇచ్చారు. కాన్సుల్ మనీష్ కుల్హరీ ప్రాతినిధ్యం వహిస్తున్న భారత కాన్సులేట్ జనరల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కళాఖండాలు తిరిగి భారత్ కు అప్పగించారు. హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ సూపర్‌వైజర్ అలెగ్జాండ్రా డి అర్మాస్ వాటిని భారత్ కు ఇవ్వడమే కాకుండా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న అనేక అక్రమ రవాణా నెట్‌వర్క్‌లపై దర్యాప్తును కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

భారతదేశంలో నుండి పురాతన వస్తువులను స్మగ్లింగ్ చేసిన సుభాష్ కపూర్ తో పాటూ, యుఎస్‌లోని నాన్సీ వీనర్‌ లు ఈ స్మగ్లింగ్ లో కీలకంగా వ్యవహరించారనే అభియోగాలు ఉన్నాయి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో దొరికిన అపురూపమైన వస్తువులను కొన్నింటిని ఇప్పటికే భారతదేశానికి అందజేశారు. 2022లో కూడా 4 మిలియన్ డాలర్ల విలువైన 307 వస్తువులను భారత కాన్సులేట్ జనరల్‌కు అందజేశారు. ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకారం, పురాతన వస్తువుల స్మగ్లర్ల నెట్‌వర్క్‌లో రింగ్ లీడర్ కపూర్ అరెస్ట్ కోసం న్యూయార్క్‌లో వారెంట్ జారీ చేశారు. అయితే అతను ప్రస్తుతం భారత్ లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

Next Story