భారత్-అమెరికా అనుబంధంపై తెగ బాధపడుతున్న పాక్ ప్రధాని

US Finds Pakistan Useful Only To Clean Up Mess In Afghanistan. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్-అమెరికా బంధంపై బాధను వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  12 Aug 2021 8:11 PM IST
భారత్-అమెరికా అనుబంధంపై తెగ బాధపడుతున్న పాక్ ప్రధాని

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్-అమెరికా బంధంపై బాధను వ్యక్తం చేశారు. తమ దేశాన్ని అమెరికా అసలు పట్టించుకోవడం లేదని.. కేవలం తాలిబాన్లతో సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే తమను వాడుకుంటోందని బాధపడిపోతూ భారత్-అమెరికా స్నేహంపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు ఇమ్రాన్ ఖాన్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లను తరిమికొట్టేందుకు పాకిస్తాన్ ను ఓ పావులా వాడుకుంటోందని అమెరికాపై ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఆఫ్ఘన్ సంక్షోభం పేరిట పాకిస్థాన్ ను 20 ఏళ్లపాటు తన అవసరాలకు ఉపయోగించుకుందని.. భారత్ తో పోల్చితే తమ దేశంతో అమెరికా భిన్న వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.

భారత్ తో దౌత్య సంబంధాలకు అమెరికా అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని.. తమను పట్టించుకోవడం లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. జనవరిలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జో బిడెన్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడకపోవడంపై పాక్ అసంతృప్తిగా ఉంది. పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయిద్ యూసుఫ్ ఇటీవల ఇమ్రాన్ ఖాన్ బాధను బయటపెట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ వంటి కొన్ని కీలక సమస్యలలో పాకిస్తాన్ ను ఒక ముఖ్యమైన దేశంగా పరిగణించినప్పటికీ, ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను సంప్రదించడానికి అమెరికా అధ్యక్షుడు బిడెన్ సంప్రదించకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు.

తాలిబాన్ నేతలు గతంలో పాక్ కు వచ్చినప్పుడు శాంతి ఒప్పందానికి అంగీకరించాలని వారికి తాము సూచించినట్టు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆఫ్ఘన్ లో ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయ అంగీకారం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. అష్రాఫ్ ఘని అధికారంలో ఉన్నంతకాలం తాము శాంతిచర్చలకు వెళ్లబోమని తాలిబాన్ నేతలు అంటున్నారని తెలిపారు


Next Story