ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్
Ukraine's President dials PM Modi. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు.
By Medi Samrat Published on 26 Feb 2022 8:01 PM ISTఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఈ భేటీలో వారిరువురు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో జరుగుతున్న పరిస్థితులపై చర్చించారు. "భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను. రష్యా దురాక్రమణను తిప్పికొట్టే ఉక్రెయిన్ గమనాన్ని గురించి తెలియజేసాను. 100,000 మందికి పైగా ఆక్రమణదారులు ఉక్రెయిన్ గడ్డపై ఉన్నారు. రష్యన్ సేనలు నివాస భవనాలపై కృత్రిమంగా కాల్పులు జరుపుతున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాకు రాజకీయ మద్దతు ఇవ్వాలని భారత్‌ను కోరాం. రష్యా దూకుడును ఆపేలా చర్యలు తీసుకోవాలని మోదీని కోరినట్లు జెలెన్స్కీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
పాశ్చాత్య దేశాల సాయం కోరుతున్న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ముమ్మరం చేసిన తరుణంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఈ విషయమూ ప్రధానమంత్రి కార్యాలయం స్పందిస్తూ.. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ పరిస్థితుల గురించి ప్రెసిడెంట్ జెలెన్స్కీ వివరంగా ప్రధానికి తెలియజేశారని పేర్కొంది. "కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగడం పట్ల ప్రధాని తీవ్ర వేదనను వ్యక్తం చేశారు. హింసను తక్షణమే నిలిపివేయాలని, చర్చలకు తిరిగి రావాలని ఆయన తన పిలుపుని పునరుద్ఘాటించారు. శాంతి ప్రయత్నాలకు భారతదేశం ఏ విధంగానైనా సహకరిస్తుందని సుముఖత వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులతో సహా భారతీయ పౌరుల భద్రత పట్ల భారత్ ఆందోళనను ప్రధాన మంత్రి తెలియజేశారు. భారతీయ పౌరులను త్వరితగతిన, సురక్షితంగా తరలించడానికి ఉక్రెయిన్ అధికారులను సహకరించాలని ఆయన కోరారు.