రష్యా దాడికి ప్రతి చర్య తప్పదు.. అమెరికా మిత్ర‌దేశాల హెచ్చ‌రిక‌లు

UK and allies will respond decisively says Boris Johnson.ఉక్రెయిన్‌పై ర‌ష్యా మిలిట‌రీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Feb 2022 12:05 PM IST
రష్యా దాడికి ప్రతి చర్య తప్పదు.. అమెరికా మిత్ర‌దేశాల హెచ్చ‌రిక‌లు

ఉక్రెయిన్‌పై ర‌ష్యా మిలిట‌రీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. ఉక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను ర‌ష్యా టార్గెట్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. రాజ‌ధాని కీవ్‌తో పాటు 11 న‌గ‌రాల‌పై బాంబుల వ‌ర్షం కురుస్తోంది. కీవ్ ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకుని బాంబుల మోత మోగిస్తోంది. ర‌ష్యా సైనిక ద‌ళాలు ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించ‌డంపై ప‌లు దేశాధినేత‌లు స్పందించారు. ఉక్రెయిన్ ప్రాంతంలో శాంతి నెల‌కొల్పాల‌ని వారు కోరుతున్నారు. ఇక అమెరికాతో పాటు దాని మిత్ర‌దేశాలు ర‌ష్యాను హెచ్చ‌రించాయి.

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల‌ను అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఖండించారు. ఉక్రెయిన్‌లో ప‌రిణామాల‌కు ర‌ష్యా బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుందన్నారు. ర‌ష్యా-ఉక్రెయిన్ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నాం. నాటో కూట‌మికి స‌హ‌క‌రిస్తాం. అన్యామైన దాడుల‌తో ఉక్రెయిన్ ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారు. ముంద‌స్తుగా నిర్ణ‌యించుకునే పుతిన్ యుద్ధానికి దిగారు. పుతిన్ చ‌ర్య తీవ్ర‌మైన విప‌త్తు, మాన‌వాళి న‌ష్టానికి దారి తీస్తుంది. రష్యా దాడులకు ప్రతి చర్య తప్పదు అని బైడెన్ అన్నారు.

ఇక బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూసి ఆందోళ‌న చెందుతున్నాను. త‌రువాత తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఆ దేశ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీతో చ‌ర్చ‌లు జ‌రిపాను. పుతిన్ ర‌క్త‌పాతాన్ని ఎంచుకున్నారు. ఎటువంటి క‌వ్వింపు చ‌ర్య‌లు లేకుండా వినాశ‌క‌ర‌మైన యుద్దాన్ని ఎంచుకున్నారు. యూకు దాని మిత్ర‌దేశాలు నిర్ణ‌యాత్మ‌కంగా స్పందిస్తాయ‌ని అని ఆయ‌న అన్నారు.

ర‌ష్యా చ‌ర్య‌లు తీవ్ర ప‌రిణామాల‌కు దారి తీస్తాయ‌ని కెనడా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో తెలిపారు. ర‌ష్యా చేస్తున్న దానికి శిక్ష అనుభ‌విస్తుంద‌న్నారు. ఉక్రెయిన్ సార్వ‌భౌమాధికారాన్ని ర‌ష్యా ఉల్లంఘిస్తోంద‌ని.. ర‌ష్యా దూకుడుకు స్పంద‌న‌గా కెన‌డా మ‌రిన్ని చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని తెలిపారు. ర‌ష్యా వెంట‌నే త‌న సైన్యాన్ని వెన‌క్కి పిల‌వాల‌న్నారు.

Next Story