పాకిస్తాన్ లో సాధారణ ప్రజలకే కాదు.. పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఏకంగా ఇద్దరు పోలీసులను అత్యంత కిరాతకంగా హత మార్చారు. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన కాల్పుల్లో కనీసం ఇద్దరు పోలీసులు మరణించారని బుధవారం ఆ దేశ మీడియా తెలిపింది. పెషావర్‌లోని హయతాబాద్ ప్రాంతంలో కొందరు అనుమానితులను అరెస్టు చేసేందుకు భద్రతా బలగాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ నిర్వహించాయి.
ఆ సమయంలో పోలీసు అధికారులను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు దుండగులు. నిందితులు కాల్పులు జరిపి అక్కడికక్కడే పోలీసులను హతమార్చి ఘటనా స్థలం నుంచి పారిపోయారని అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున, పెషావర్‌లో డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు అతనిపై కాల్పులు జరపడంతో ఒక పోలీసు కూడా మరణించాడని జిన్హువా న్యూస్ నివేదించింది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ లో లా అండ్ ఆర్డర్ ఏ మాత్రం కుదురుగా లేదని ప్రజలు వాపోతున్నారు.