రష్యాపై కొత్త చర్యలకు సిద్ధమని ట్రంప్ వార్నింగ్..భారత్‌పైనా ప్రభావం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం రష్యాపై “రెండో దశ ఆంక్షలు” విధించేందుకు సిద్ధమని సంకేతం ఇచ్చారు.
By Knakam Karthik
రష్యాపై కొత్త చర్యలకు సిద్ధమని ట్రంప్ వార్నింగ్..భారత్‌పైనా ప్రభావం
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం రష్యాపై “రెండో దశ ఆంక్షలు” విధించేందుకు సిద్ధమని సంకేతం ఇచ్చారు. ఈ చర్యలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ వంటి దేశాలపై కూడా ప్రభావం చూపవచ్చని హెచ్చరిక వెలువడింది.
కీవ్‌లోని ముఖ్య ప్రభుత్వ సముదాయంపై రష్యా భారీ వైమానిక దాడి జరిపిన గంటలకే వైట్‌హౌస్‌లో విలేకరుల ప్రశ్నలకు స్పందించిన ట్రంప్, రష్యా లేదా రష్యా చమురు కొనుగోలుదారులపై కొత్త ఆంక్షలకు సిద్ధమా? అన్న ప్రశ్నకు “అవును” అని సంక్షిప్తంగా సమాధానమిచ్చారు. వివరాలు వెల్లడించకపోయినా, యుద్ధం కొనసాగుతుండటం పట్ల ఆయన నిరాశ వ్యక్తం చేసినట్లు అర్థమవుతోంది.
ఈ క్రమంలో, అమెరికా ఆర్థిక శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ, “రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అమెరికా-యూరోపియన్ యూనియన్ కలిసి ద్వితీయ ఆంక్షలు (secondary tariffs) విధించే అవకాశం ఉంది. రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడే అధ్యక్షుడు పుతిన్ చర్చల టేబుల్‌కు వస్తారు” అని పేర్కొన్నారు.
గత నెలలోనే అమెరికా భారత్‌పై భారీ టారిఫ్‌లు విధించిన విషయం గమనార్హం. భారత ఎగుమతులపై 25 శాతం శిక్షా సుంకం (penal tariff) విధించగా, మొత్తం దిగుమతి సుంకం 50 శాతానికి చేరింది. “భారత్ రష్యా యుద్ధ యంత్రాన్ని ఇంధనం అందిస్తోంది” అని ట్రంప్ ఆరోపిస్తూ, ఆంక్షలు అవసరమని సమర్థించారు. అయితే, భారత్ మాత్రం తన ఎనర్జీ భద్రత కోసం రష్యా చమురును కొనుగోలు చేయడం తప్పు కాదని వాదిస్తోంది. ఇదిలా ఉండగా, ఇటీవల ట్రంప్-మోదీ ఆన్‌లైన్ సంభాషణతో ద్వైపాక్షిక సంబంధాలు కాస్త సానుకూలంగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ముదురుతోంది
ఆదివారం రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై డ్రోన్లు, క్షిపణులతో భారీ వైమానిక దాడి చేసింది. ఇది యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన అతిపెద్ద గాలి దాడి అని ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. మొత్తం 810 డ్రోన్లు, డీకాయ్‌లతో దాడి జరిపారని, అందులో 747 డ్రోన్లు, నాలుగు క్షిపణులను తామే కూల్చేశామని పేర్కొంది.
దాడుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఒక ముఖ్య ప్రభుత్వ భవనం ధ్వంసమైంది. ఈ పరిణామాల మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ, “పుతిన్‌తో నేరుగా చర్చించడానికి సిద్ధం” అని ప్రకటించారు. అలాగే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను “రష్యాపై కఠిన ఆంక్షలు విధించి యుద్ధాన్ని ఆపించేందుకు ఒత్తిడి తేవాలి” అని విజ్ఞప్తి చేశారు