డొనాల్డ్ ట్రంప్‌ను వెంటాడుతూ ఉన్నాయి.!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కు ఊహించని షాక్‌ తగిలింది.

By Medi Samrat  Published on  27 Jan 2024 9:23 AM GMT
డొనాల్డ్ ట్రంప్‌ను వెంటాడుతూ ఉన్నాయి.!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్‌ కారోల్‌ వేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్‌లోని మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమెకు 83 మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 83.3 మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.692 కోట్లకుపైమాటే. ట్రంప్‌ తనను లైంగికంగా వేధించాడని కారోల్‌ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి. 1990లో మాన్‌హటన్‌ అవెన్యూలోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మాన్ డిపార్ట్ మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని జీన్ కారోల్ ఆరోపించింది. 2019లో తన గురించి అసభ్యకరంగా మాట్లాడి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ పరువునష్టం దావా వేసింది. శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ట్రంప్‌ కు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమెకు నష్టపరిహారం కింద 18.3 మిలియన్‌ డాలర్లతో పాటు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు మరో 65 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఫెడరల్‌ కోర్టు ఆదేశించింది.

ఇక ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ దూసుకుపోతున్నారు. రిపబ్లిక్‌ పార్టీ తరపున అధ్యక్ష పదవికి ట్రంప్‌ నామినేషన్‌ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అయోవా, న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన రిపబ్లికన్‌ ప్రైమరీ బ్యాలెట్‌లో ట్రంప్‌ విజయాన్ని నమోదు చేసుకున్నారు. అయితే పలు కేసులు మాత్రం డొనాల్డ్ ట్రంప్ ను వెంటాడుతూనే ఉన్నాయి.

Next Story