మోదీ, నేను పనులు పూర్తిచేసే వ్యక్తులం..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు.
By - Medi Samrat |
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు బలపడటంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ.. ప్రధాని మోదీ పనులు సాధించే నాయకుడని ట్రంప్ అభివర్ణించారు. భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి మోదీని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యను పంచుకుంది. "భవిష్యత్తులో భారతదేశంతో మన అద్భుతమైన సంబంధం మరింత బలపడుతుంది. ప్రధానమంత్రి మోదీ, నేను పనులు పూర్తిచేసే వ్యక్తులం, ఈ మాట చాలా మంది గురించి చెప్పరు" అని రాసింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాకస్థాయిలో ఉన్నప్పుడు.. ఇరాన్ వివాదం, హోర్ముజ్ జలసంధి భద్రత వంటి ముఖ్యమైన ప్రపంచ సమస్యలపై భారత్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలో భారత ప్రధాని విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విధంగా స్పందించడం గమనార్హం.
గత మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడటం గమనార్హం. అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియాలో "అధ్యక్షుడు ట్రంప్ నాకు ఫోన్ చేశారు, పశ్చిమ ఆసియాలోని పరిస్థితిపై మేమిద్దరం ఉపయోగకరమైన చర్చ జరిపాము" అని రాశారు. అక్కడ ఉద్రిక్తతలను త్వరగా తగ్గించి, శాంతిని పునరుద్ధరించడాన్ని భారత్ సమర్థిస్తుంది. హోర్ముజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా, అందుబాటులో ఉంచడం ప్రపంచం మొత్తానికి అత్యంత కీలకం. శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగించాలని మేం అంగీకరించాం అని తెలిపారు.