అవినీతి, ద్రవ్యోల్బణం అంతం చేస్తా.. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంలో డొనాల్డ్ ట్రంప్ మరోసారి సత్తా చాటారు.
By Medi Samrat Published on 21 Jan 2025 8:38 AM ISTప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంలో డొనాల్డ్ ట్రంప్ మరోసారి సత్తా చాటారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం గన్ సెల్యూట్ చేశారు. జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా స్వర్ణయుగం ప్రారంభమైందని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్‌కు అభినందనలు తెలిపారు.
భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10.30 గంటలకు.. ట్రంప్ US క్యాపిటల్ లోపల బైబిల్‌పై చేయి ఉంచి ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు. వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ట్రంప్ ముందు ప్రమాణం చేశారు. తీవ్రమైన చలి కారణంగా.. ఈసారి ప్రమాణ స్వీకారం US క్యాపిటల్‌లోని క్యాపిటల్ రోటుండా (హాల్)లో జరిగింది. కాపిటల్ బిల్డింగ్‌లోని గోపురం క్రింద కాపిటల్ రోటుండా ఉంది.
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ తన ఉద్రేకపూరిత ప్రసంగంలో.. జనవరి 20ని "విమోచన దినం"గా అభివర్ణించారు. తొలిరోజే పలు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు ఇస్తానని ట్రంప్ తెలిపారు. అమెరికా ఫస్ట్ అనే విధానం మాది. ఈరోజు నుంచి మార్పు ప్రారంభం కానుంది. అత్యంత శక్తివంతమైన, అత్యంత గౌరవనీయమైన దేశంగా అమెరికా తన సముచిత స్థానాన్ని తిరిగి పొందుతుంది. అవినీతి, ద్రవ్యోల్బణం అంతం చేస్తానని హామీ ఇచ్చారు. డ్రగ్ స్మగ్లర్లను ఉగ్రవాదులుగా ప్రకటిస్తామని, అమెరికా సైన్యం ఇతరుల యుద్ధాలకు వెళ్లదని ప్రకటించారు.
అమెరికా చరిత్రలో మొదటి టర్మ్ తర్వాత ఓడిపోయిన రెండో అధ్యక్షుడు ట్రంప్, నాలుగేళ్ల తర్వాత మళ్లీ అధ్యక్షుడయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌పై ట్రంప్ విజయం సాధించారు. ట్రంప్ తొలి పదవీకాలం 2017 నుంచి 2021 వరకు కొనసాగింది. నేరం రుజువైన తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. పోర్న్ స్టార్‌కు చెల్లించిన డబ్బు గురించి దాచిపెట్టినట్లు న్యూయార్క్ జ్యూరీ నిర్ధారించింది.
అమెరికాను గొప్పగా నిలపడానికి దేవుడు నా ప్రాణాలను రక్షించాడు. ముందుగా మన దక్షిణ సరిహద్దులో (అమెరికా-మెక్సికో సరిహద్దు) జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తానని ఆయన చెప్పారు. అక్రమ చొరబాట్లన్నీ వెంటనే అరికట్టబడతాయి. అక్రమ వలసదారులు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి పంపిస్తామన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మెక్సికో సరిహద్దు నుంచి పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించడం గమనార్హం.
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్, అతని భార్య మెలానియా ట్రంప్ వైట్ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ వారికి కరచాలనంతో స్వాగతం పలికారు. వైట్‌హౌస్‌కు స్వాగతం అని ఆయన అన్నారు. అంతకుముందు ట్రంప్ వాషింగ్టన్ లోని సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చికి వెళ్లారు. ఈ సమయంలో టెస్లా, SpaceX CEO ఎలోన్ మస్క్, అమెజాన్ CEO జెఫ్ బెజోస్, Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ కూడా ట్రంప్‌తో ఉన్నారు. అంతకుముందు.. కొత్తగా ఎన్నికైన ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ వర్జీనియాలోని ఆర్లింగ్టన్ నేషనల్ శ్మశానవాటికలో సైనికుల సమాధి వద్ద సైనికులకు నివాళులర్పించారు.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ హాజరయ్యారు. ఈ వేడుకలో భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ వేడుకకు ట్రంప్ భార్య మెలానియా, ఆయన కూతురు ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నర్, బిలియనీర్ వ్యాపారవేత్తలు ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, టిమ్ కుక్ హాజరయ్యారు.