ఆ భయంతోనే భారత్-పాక్‌ యుద్ధం ఆగిపోయింది : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై పెద్ద ప్రకటన చేశారు.

By -  Medi Samrat
Published on : 13 Oct 2025 4:41 PM IST

ఆ భయంతోనే భారత్-పాక్‌ యుద్ధం ఆగిపోయింది : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై పెద్ద ప్రకటన చేశారు. మధ్యప్రాచ్యంలో తన పర్యటన సందర్భంగా.. ట్రంప్ భారతదేశం-పాకిస్తాన్ వివాదంలో సుంకాలే నిజమైన శాంతి కర్తగా అభివర్ణించారు. విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఎనిమిది యుద్ధాలను పరిష్కరించడం గురించి మాట్లాడారు. నేను చాలా యుద్ధాలను టారిఫ్‌ల ఆధారంగా పరిష్కరించాను అని ట్రంప్ అన్నారు. ఉదాహరణకు.. భారత్‌-పాకిస్తాన్ మధ్య వివాదం కూడా.. మీరు యుద్ధం చేయాలనుకుంటే.. మీ వద్ద అణ్వాయుధాలు ఉంటే.. నేను మీపై భారీ సుంకాలు విధిస్తాను. ఆ సుంకం 50 శాతం, 100 శాతం లేదా 200 శాతం కూడా కావచ్చు.. కేవలం సుంకాల ప్రాతిపదికన తాను 24 గంటల్లో యుద్ధాన్ని పరిష్కరించానని ట్రంప్ పేర్కొన్నారు.

ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీ-ఖైదీల మార్పిడికి ముందు మధ్యప్రాచ్య పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ.. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తత గురించి కూడా మాట్లాడినట్లు చెప్పారు. తాను "యుద్ధాలను పరిష్కరించడంలో" నిపుణుడను కాబట్టి సమస్యను పరిష్కరిస్తానని కూడా చెప్పారు.

'ఆపరేషన్ సింధూర్‌' తర్వాత 2025 మేలో కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుండి.. యుద్ధం ఆపడంలో తాను ముఖ్యమైన పాత్ర పోషించానని ట్రంప్ పదేపదే ప్రకటించడం గమనార్హం. ట్రంప్ తన వాణిజ్యం, సుంకాల విధానానికి తరచుగా క్రెడిట్ ఇచ్చారు. అయితే, ఎటువంటి మూడవ పక్షం మధ్యవర్తిత్వం లేకుండానే ఇరు పక్షాల సైనిక నాయకత్వం మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారా యుద్ధాన్ని నిలిపివేసే నిర్ణయం తీసుకున్నట్లు భారత్ వాదిస్తోంది.

Next Story