అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రంప్ వ్యాఖ్యలు ఉండేవి. అందుకని ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు ట్రంప్ ఖాతాలను బ్యాన్ చేశాయి. . అధ్యక్ష ఎన్నికల తర్వాత ఫలితాలను ట్రంప్ అంగీకరించకుండా.. ఎన్నికల్లో మోసం జరిగిందని ఆరోపించడంతో ట్రంప్ మద్దతుదారులు యూఎస్ కాపిటల్ భవనంపై దాడి చేశారు. ఈ క్రమంలో హింసను ప్రేరేపించేలా కామెంట్లు చేశారని పేర్కొంటూ ట్విట్టర్, ఫేస్ బుక్ రెండు సంస్థలూ ట్రంప్ ఖాతాలను బ్యాన్ చేశాయి.
దీంతో ట్రంప్ ఫ్లోరిడాలోని కోర్టులో కేసు వేశారు. తన ఖాతాలను పునరుద్ధరించేలా ఫేస్ బుక్, ట్విట్టర్ సంస్థలను ఆదేశించాలని ట్రంప్ కోరారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ట్రంప్ తన ఖాతాలు బ్యాన్ అయినప్పటి నుంచి ప్రజలకు ఏం చెప్పాలన్నా కష్టంగా ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ట్రంప్ ఇలా కోర్టుకెక్కినట్లు వచ్చిన వార్తలపై స్పందించడానికి ట్విట్టర్ నిరాకరించింది. ఒకానొక దశలో తానే ఓ కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను తీసుకుని వస్తానని సంచలన ప్రకటనలు చేశారు.