టర్కీ, సిరియా దేశాల్లో వరుసగా భారీ భూకంపాలు వస్తున్నాయి. వేకువ జామున 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించగా, మధ్యాహ్నం 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. తాజాగా 6.0 తీవ్రతతో మూడో భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రం సెంట్రల్ టర్కీలో ఉన్నట్టు గుర్తించారు. 12 గంటల వ్యవధిలో మూడు భారీ భూకంపాలు సంభవించడంతో ప్రజలు ఎంతగానో భయపడుతూ ఉన్నారు. ఇప్పటిదాకా 1600 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, శిథిలాల కింద నుంచి ఇంకా వెలికితీత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య 5 వేలకు చేరొచ్చని భావిస్తూ ఉన్నారు. టర్కీ, సిరియా దేశాల్లో భారీ ఎత్తున సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం కారణంగా భారీ విధ్వంసం చోటుచేసుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భూకంప బాధిత దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించింది. వైద్యబృందాలు, ఔషధాలను కూడా పంపించింది.