పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్‌లోని కోర్టు ముందు పేలుడు సంభవించింది. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. జియో టీవీ కథనం ప్రకారం ఇది ఆత్మాహుతి దాడి అని తెలుస్తుంది. ఇస్లామాబాద్‌లోని కోర్టు బయట పార్క్ చేసిన కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రిలో చేర్పించారు.
గాయపడిన వారిలో ఎక్కువ మంది న్యాయవాదులు, పిటిషనర్లు ఉన్నారు. పేలుడు అనంతరం కోర్టు మొత్తం గందరగోళం నెలకొంది. దీంతో పోలీసులు వెంటనే కోర్టు ఆవరణను ఖాళీ చేయించారు. కోర్టుకు హాజరైన వారిని వెనుక ద్వారం నుంచి బయటకు తీసుకొచ్చారు. అదే సమయంలో కోర్టు కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. పేలుడు సమాచారం అందిన వెంటనే ఇస్లామాబాద్ డీఐజీ, చీఫ్ కమిషనర్, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత ఇస్లామాబాద్‌లోని పిమ్స్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ దాడిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.