పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి విదేశాలకు పరారైన వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ ముఖ్య అనుచరుడు సుభాష్ శంకర్ పరాబ్ (49) ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నీరవ్ మోదీ కుంభకోణం దర్యాప్తులో భాగంగా పరబ్ సుభాష్ శంకర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బృందం మంగళవారం ఉదయం తిరిగి ముంబైకి రప్పించింది. సుభాష్ శంకర్ కైరోలో ఉండగా.. చట్టపరమైన ప్రక్రియల తర్వాత భారతదేశానికి తీసుకువచ్చారని సీబీఐ అధికారి తెలిపారు. పీఎన్ బీ అధికారులతో నీరవ్ మోదీ సంస్థలు కుమ్ముక్కై 'లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్స్' ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టాయి. నీరవ్ మోదీ కంపెనీలలో ఒకదానికి డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా సుభాష్ శంకర్ పనిచేశాడు.
CBI అభ్యర్థన మేరకు, ఇంటర్‌పోల్ 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణానికి సంబంధించి నీరవ్, అతని సోదరుడు నిషాల్ మోదీ, సుభాష్ శంకర్‌లపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. నీరవ్ మోదీకి చెందిన ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్, డైమండ్ ఆర్ యూఎస్ కు డైరెక్టర్ గా శంకర్ పనిచేశాడు. 2018 జనవరిలో దుబాయి నుంచి అతడు కైరోకు పారిపోయాడు. అదే సమయంలో నీరవ్ మోదీ, ఆయన మామ మెహుల్ చోక్సీ కుటుంబ సభ్యులతో పాటు భారత్ నుంచి పరారయ్యాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ప్రకారం, డిసెంబర్ 2021లో, గత ఐదేళ్లలో 33 మంది బ్యాంకు మోసాల నిందితులు దేశం విడిచి పారిపోయారని పార్లమెంటుకు నోటీసులు అందాయి.