భారత్‌కు రానున్న పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ భారతదేశ పర్యటనకు రానున్నారు.

By Medi Samrat  Published on  2 Dec 2024 5:28 PM IST
భారత్‌కు రానున్న పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ భారతదేశ పర్యటనకు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు 2025 ప్రారంభంలో భారతదేశాన్ని పుతిన్ సందర్శించనున్నారు. సంవత్సరానికి ఒకసారి సమావేశాలు నిర్వహించాలని భారతదేశ ప్రధాని మోదీ, పుతిన్ మధ్య ఒప్పందం ఉందని, ఈ సంవత్సరం జూలైలో మోదీ మాస్కోకు రాగా.. ఈసారి పుతిన్ రానున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి తెలిపారు. జులైలో చర్చల సందర్భంగా భారత్‌లో పర్యటించాల్సిందిగా పుతిన్‌కు ప్రధాని మోదీ ఆహ్వానం పలికారు. మోదీ ఆహ్వానాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని, పుతిన్ పర్యటనకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని రష్యా ప్రతినిధి తెలిపారు.

2024లో పుతిన్- మోదీ రెండుసార్లు కలుసుకున్నారు. మొదట జులైలో 22వ రష్యా-భారత్ శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని మోదీ మాస్కో పర్యటనకు వెళ్లగా.. అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో పుతిన్-మోదీ కలిశారు. గత నెలలో క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీని కలిసేందుకు, భారతదేశాన్ని సందర్శించడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నారని, అయితే పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను త్వరలో రూపొందిస్తామన్నారు. 2022లో ఉక్రెయిన్-రష్యా వివాదం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

Next Story