తండ్రి చూస్తుండగానే.. కొడుకును తినేసిన షార్క్
Russian Man Killed In Shark Attack Off Egyptian Red Sea Resort. షార్క్ ల గురించి సినిమాల్లో చూపించినట్లుగా బయట ఉండదని అంటూ ఉంటారు.
By Medi Samrat Published on 10 Jun 2023 10:50 AM ISTషార్క్ ల గురించి సినిమాల్లో చూపించినట్లుగా బయట ఉండదని అంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు షార్క్ లు అటాక్ చేసిన ఘటనల గురించి మనం వింటూ ఉంటాం. తాజాగా ఓ షార్క్ యువకుడిని చంపేసిన ఘటన ఈజిప్ట్ లో చోటు చేసుకుంది. ఈజిప్టులోని బీచ్‌లో ఈతకొడుతున్న యువకుడిపై షార్క్ దాడి చేసి చంపేసి తినేసింది. యువకుడి తండ్రితో పాటు పలువురు చూస్తుండగానే ఈ విషాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈజిప్టులో సొరచేప దాడి చేసి నీటి అడుగున ఈడ్చుకెళ్లడంతో రష్యాకు చెందిన వ్యక్తి మరణించాడు. ఎర్ర సముద్రపు రిసార్ట్ నగరం హుర్ఘదా తీరంలో గురువారం ఈ సంఘటన జరిగింది. దాడి చేసింది టైగర్ షార్క్ అని ఆ దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనతో తీరప్రాంతంలోని 74 కిలోమీటర్లను అధికారులు మూసివేశారు. ఆదివారం వరకు ఇతర వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలకు, ఈతకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వ్యక్తి తన చుట్టూ తిరుగుతూ దాడి చేస్తున్న షార్క్ నుండి దూరంగా వెళ్ళిపోడానికి ఈత కొడుతూ ఉన్నట్లు ప్రయత్నిస్తూ ఉండడం వైరల్ వీడియోలో చూపిస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి అతన్ని ఆ షార్కు నీటి లోపలికి లాగేసింది. కొంతమంది ఆ వ్యక్తికి సహాయం చేయడానికి వెళ్లినప్పటికీ సమయానికి చేరుకోలేకపోయారు.
ఈజిప్ట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు షార్క్‌ను పట్టుకున్నారని.. ఈ దాడికి కారణాలను తెలుసుకోవడానికి దానిని పరిశీలిస్తున్నారని గార్డియన్ నివేదించింది. హుర్ఘదాలోని రష్యన్ కాన్సులేట్ ఆ వ్యక్తిని రష్యన్ పౌరుడిగా గుర్తించింది, కానీ అతని పేరును పేర్కొనలేదు. అతను 1999లో జన్మించాడని, అయితే ఈజిప్టులోనే నివసించాడని రష్యాకు చెందిన టాస్ వార్తా సంస్థ తెలిపింది.