అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిరంతరం టార్గెట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఎలా ఓడించిందో.. అదే విధంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిస్తుందని అన్నారు. బీజేపీ విద్వేషపూరిత భావజాలాన్ని కాంగ్రెస్ పార్టీయే కాకుండా దేశ ప్రజలు ఓడిస్తారని రాహుల్ గాంధీ అన్నారు. వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో పర్యటనల తర్వాత రాహుల్ గాంధీ న్యూయార్క్ చేరుకున్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్-యుఎస్ఎ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 'కర్ణాటకలో బీజేపీని ఓడించగలమని చేసి చూపించాం. బీజేపీని ఓడించడమే కాకుండా దుమ్ము దులిపేశాం. కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నించిందని అన్నారు. వారికి మీడియా, మనకంటే 10 రెట్లు ఎక్కువ డబ్బు, ఏజెన్సీలు ఉన్నా.. వారిని ఓడించాము. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా వారిని ఓడిస్తామని అన్నారు.
రాహుల్ గాంధీ ఆదివారం కూడా మాన్‌హాటన్‌లో ర్యాలీ నిర్వహించనున్నారు. న్యూయార్క్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ కనపడదని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ సంతతికి చెందిన వారితో పాటు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. తెలంగాణలోనే కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా కర్ణాటక తరహా విజయాలు నమోదుచేస్తామన్నారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలకు ముందు జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తున్నామన్నారు. బీజేపీ సమాజంలో ద్వేషాన్ని పెంచుతున్న తీరుతో దేశం ముందుకు సాగదని అర్థమైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తామని రాహుల్ ప్రకటించారు.