ఇద్దరి మధ్య మొదలైన గొడవ.. 118 మంది చనిపోయే దాకా..!

Police regain control of Ecuador prison after 118 die in rioting. అదేదో హాలీవుడ్ సినిమాలో చూసినట్లుగా.. జైలులోని ఖైదీలు అందరూ ఒకరిని మరొకరు

By Medi Samrat  Published on  1 Oct 2021 12:59 PM GMT
ఇద్దరి మధ్య మొదలైన గొడవ.. 118 మంది చనిపోయే దాకా..!

అదేదో హాలీవుడ్ సినిమాలో చూసినట్లుగా.. జైలులోని ఖైదీలు అందరూ ఒకరిని మరొకరు కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఎలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ.. దొరికిన వస్తువులతో దాడులు చేసుకోవడం మొదలుపెట్టారు. పోలీసులు కూడా చూస్తూ ఉండడం తప్ప మరేమీ చేయలేకపోయారు. దీంతో శవాల దిబ్బలా పరిస్థితి తయారైంది. 100 మందికి పైగా కొన్ని గంటల్లోనే మరణించారు.

ఈ ఘటన ఈక్వెడార్‌ దేశంలోని గుయాక్విల్‌ జైలులో చోటు చేసుకుంది. ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం 118 మంది మరణించారు. జైలులోని రెండు గ్యాంగుల మధ్య పెరిగిన మాటల యుద్ధం చివరికి చంపుకునే వరకూ వెళ్లింది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం, కత్తులతో దాడి చేసుకోవడం, పేలుడు పదార్థాలను విసురుకోవడంతో దాదాపు 118 మంది ప్రాణాలుకోల్పోయారు. ఈక్వెడార్‌ దేశ చరిత్రలో జైలులో ఇలాంటి ఘోర ఘటన చోటు చేసుకోలేదట. పరిస్థితి చాలా తీవ్రంగా ఉండటంతో ఆ దేశ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో జైళ్లలో అత్యవసర పరిస్థితిని విధించారు. డ్రగ్స్‌ కేసుల్లో నిందితులైన ఖైదీలే ఈ ఘర్షణకు పాల్పడినట్టు అధికారులు చెప్పారు. ముఖ్యంగా జైలులో ఆధిపత్యపోరు కోసం ఒకరినొకరు చంపుకున్నారని తెలిపారు. 118 మంది ప్రాణాలు కోల్పోయాక కానీ జైలు అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనం లోకి తీసుకోలేకపోయారు.

ఖైదీల మధ్య హింసాత్మక ఘర్షణల్లో 118 మంది మరణించగా.. డజన్ల కొద్దీ గాయపడిన తరువాత గ్వాయాక్విల్‌లోని జైలును పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. "అంతా ప్రశాంతంగా ఉంది, వారు (ఖైదీలు) వారి సెల్‌లలో ఉన్నారు." అని పోలీసు కమాండర్ జనరల్ తన్య వరేలా విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. భారీ సెక్యూరిటీ ఆపరేషన్ తర్వాత 900 మంది అధికారులు కలిసి ఈ జైలును కంట్రోల్ లోకి తీసుకున్నారు.


Next Story