ఓమిక్రాన్ ఆందోళన నేఫథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈ, కువైట్ పర్యటనలు వాయిదా పడ్డాయి. జనవరి 6న పర్యటన షెడ్యూల్ ఖరారు కాగా.. వాయిదా పడింది. పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల కారణంగా పర్యటనను రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరిలో మోదీ పర్యటన ఉండే అవకాశం ఉందని సౌత్‌బ్లాక్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ఓమిక్రాన్ వేరియంట్ యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. యుఎస్‌లో ఓమిక్రాన్ కేసులు ఇప్పుడు ఆధికంగా నమోదు అవుతున్నాయి.
బ్రిటన్‌లో ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల.. కోవిడ్-19 కేసులు ప్రతిరోజూ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. భారత్‌లో నవంబర్ 24న ఓమిక్రాన్ కనుగొనబడినప్పటి నుండి ఇప్పటివరకూ దాదాపు 800 కేసులు నమోదవడంతో పరిస్థితి ఇప్పడుమాత్రం నియంత్రణలోనే ఉంది. ఇక యూఏఈలో సోమవారం 1,732 కొత్త కరోనా కేసులు నమోదవగా.. ఒక మరణం సంభవించింది. కోవిడ్ -19 వేగంగా వ్యాప్తి చెందడంతో అబుదాబి దేశంలోకి ప్రవేశించడానికి నిబంధనలను కఠినతరం చేసింది.
అబుదాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ ప్రకారం.. టీకాలు వేయించుకున్న వ్యక్తుల మొబైల్ ఫోన్ హెల్త్ యాప్‌లో గ్రీన్ స్టేటస్ అవసరం. టీకాలు వేసుకోని వారికి డిసెంబర్ 30 నుండి ఎమిరేట్‌లోకి ప్రవేశించడానికి నెగటివ్ రిపోర్టు అవసరం. ఇప్పటివరకూ యూఏఈలో 7,55,000 కరోనా కేసులు నమోదుకాగా.. 2,160 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుత యాక్టివ్ కేసులు 10,186గా ఉన్నాయి.