దీపావళి పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంభాషణ జరిగింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రధాని మోదీ ఈ సమాచారాన్ని ఇచ్చారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచానికి ఆశాజ్యోతిని అందిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు.
బుధవారం ప్రధాని మోదీ తన పోస్ట్‌లో అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌కాల్, దీపావళి శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వెలుగుల పండుగ రోజున మన రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచానికి ఆశాజ్యోతి వెలుగును అందించాలని.. అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలని పోస్ట్‌లో రాశారు.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి సందర్భంగా భారతీయ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో దీపావళి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రజలను తాను ప్రేమిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ గొప్ప నాయకుడని ట్రంప్ అన్నారు.
ఇదిలావుంటే.. గత వారం మోదీతో ఫోన్ సంభాషణ జరిపానని ట్రంప్ చెప్పగా.. అది అబద్ధం ప్రధాని మోదీ ఎటువంటి ఫోన్ కాల్ మాట్లాడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ వ్యాఖ్యలను ఖండించింది. ఇప్పుడు ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్ ద్వారా సంభాషణకు సంబంధించి సమాచారమిచ్చారు.