ఐదేళ్ల తర్వాత భేటీ అయిన ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్

రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న 16వ బ్రిక్స్ సమ్మిట్ 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను క‌లిశారు

By Medi Samrat  Published on  23 Oct 2024 1:26 PM GMT
ఐదేళ్ల తర్వాత భేటీ అయిన ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్

రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న 16వ బ్రిక్స్ సమ్మిట్ 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను క‌లిశారు. 2019 తర్వాత ఇరువురు నేత‌లు భేటీ అవ‌డం ఇదే తొలిసారి. రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ వ్యవస్థపై ఏకాభిప్రాయం కుదిరిన 72 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే ఇరువురు నేత‌లు క‌ల‌వ‌డం విశేషం. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని అంతా భావిస్తున్నారు.

భారతదేశంతో వాస్తవ నియంత్రణ రేఖపై (తూర్పు లడఖ్ ప్రాంతంలో) నాలుగు సంవత్సరాల నాటి వివాదాన్ని పరిష్కరించడానికి రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని చైనా కూడా మంగళవారం నాడు ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని చైనా కూడా చెప్పింది. ఈ విషయాన్ని భారత్ ఒకరోజు ముందే ప్రకటించింది.

గాల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత పెట్రోలింగ్ ఏర్పాటులో పురోగతి వచ్చింది. రెండు దేశాలు సరిహద్దు వెంబడి వేలాది మంది సైనికులను మోహరించిన ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక అడుగు ముందుకుప‌డింది.

తమ వివాదాస్పద హిమాలయ సరిహద్దు వెంబడి నాలుగేళ్లుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి అంగీకరించినట్లు న్యూఢిల్లీ ప్రకటించిన రెండు రోజుల తర్వాత.. రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారని భారత ప్రభుత్వం, చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ బేటీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)లో 2020కి ముందు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించడానికి మార్గం సుగమం చేస్తుందని వెల్ల‌డించాయి.

Next Story