ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి వద్దు..మానవాళికే ముప్పు: మోదీ
షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ఉగ్రవాదంపై స్పష్టమైన సందేశాన్ని అందించారు
By Knakam Karthik
ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి వద్దు..మానవాళికే ముప్పు: మోదీ
టియాంజిన్‌లో జరిగిన 25వ SCO శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. సదస్సులో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని, ఆతిథ్యం అందించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్ SCOలో ఎల్లప్పుడూ రచనాత్మక మరియు సానుకూల పాత్ర పోషించిందని గుర్తు చేశారు. భారత్ దృష్టి మూడు ప్రధాన స్తంభాలపై ఉందని ఆయన స్పష్టం చేశారు – సెక్యూరిటీ, కనెక్టివిటీ, అపర్చ్యునిటీ.
ఉగ్రవాదం మొత్తం మానవాళికే ముప్పని, దానిపై డబుల్ స్టాండర్డ్స్ అంగీకరించలేమని మోదీ స్పష్టం చేశారు. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, భారత్‌తో ఐక్యత చూపిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కనెక్టివిటీ అంశంలో, చాబహార్ పోర్ట్, నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ ద్వారా ఆఫ్గానిస్తాన్, మధ్య ఆసియాతో సంబంధాలు పెంపొందిస్తున్నామని చెప్పారు. కనెక్టివిటీ ప్రయత్నాల్లో సార్వభౌమత్వం గౌరవించబడాలని స్పష్టం చేశారు.
భారత్ అధ్యక్షత వహించిన సమయంలో స్టార్ట్‌అప్స్, డిజిటల్ ఇన్‌క్లూజన్, బౌద్ధ వారసత్వం, యువ శక్తి వంటి కొత్త అంశాలను తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు SCO కింద సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. “రిఫార్మ్ – పెర్ఫార్మ్ – ట్రాన్స్‌ఫార్మ్” మంత్రంతో భారత్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యానికి ఆహ్వానం పలికారు.
అంతర్జాతీయ నేరాలు, డ్రగ్ ట్రాఫికింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సమస్యలపై SCO కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడం స్వాగతార్హమని చెప్పారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు పాత వ్యవస్థలలో బంధించబడకూడదని, UN రీఫార్మ్ కోసం SCO ఏకగ్రీవంగా కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. చివరగా, SCO తదుపరి అధ్యక్షత్వం స్వీకరించబోతున్న కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు జపారోవ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.