పాక్ సైన్యం తీవ్రవాదులకు మద్దతుగా ఉంటోందనే ఆరోపణలు గత కొన్నేళ్లుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొన్ని షాకింగ్ చిత్రాలు బయటకు వచ్చాయి. ఇందులో పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులకు బోర్డర్ లో ఫార్వర్డ్ పోస్ట్‌లకు మార్గనిర్దేశం చేయడం, భారతదేశం లోకి చొరబడడానికి మార్గాలను చూపడం కనిపిస్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని కోట్లి సమీప ప్రాంతాల నుండి ఈ విజువల్స్ తెరపైకి వచ్చాయి. భారత సరిహద్దుల్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులకు సైన్యం శిక్షణ ఇస్తున్నట్లు పీఓకే నుంచి చిత్రాలు వెలువడిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది.
భారత సైన్యంలోని ఒక ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం.. అంతర్జాతీయ సరిహద్దు గుండా చొరబడేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నుతోంది. పాకిస్థాన్ రేంజర్ల ముసుగులో పంజాబ్ లేదా జమ్మూ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సియాల్‌కోట్ మీదుగా ఉగ్రవాదులు చొరబడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉగ్రవాదుల సంఖ్య దాదాపు 50-55 వరకు ఉంటుందని అంచనా. సాంబా నుండి హీరానగర్ మీదుగా కథువాకు తీవ్రవాదులు చేరుకుంటున్నారని తేలింది.