రైలు హైజాక్‌లో భార‌త్ హ‌స్తం ఉంద‌న్న‌ పాక్.. గ‌ట్టిగా స‌మాధాన‌మిచ్చిన భార‌త్‌

పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ కేసులో భిన్నమైన వాదనలు ముందుకు వస్తున్నాయి.

By Medi Samrat  Published on  14 March 2025 12:35 PM IST
రైలు హైజాక్‌లో భార‌త్ హ‌స్తం ఉంద‌న్న‌ పాక్.. గ‌ట్టిగా స‌మాధాన‌మిచ్చిన భార‌త్‌

పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ కేసులో భిన్నమైన వాదనలు ముందుకు వస్తున్నాయి. హైజాకింగ్‌కు సంబంధించిన ఆపరేషన్‌ను ముగించామ‌ని పాక్ ఆర్మీ మాట్లాడుతుండగా.. బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ అబద్ధం చెబుతోందని పేర్కొన్నారు. అయితే.. రైలు హైజాక్‌కు సంబంధించి పాకిస్తాన్ భారతదేశంపై ఆరోపణ‌లు చేసింది. దీనికి భారత్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది.

పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ దాడిలో భారత్‌ హస్తం ఉందని పాకిస్థాన్‌ ఆరోపించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ చేస్తున్న నిరాధార ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్లోబల్ టెర్రరిజం కేంద్రం ఎక్కడ ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలు, వైఫల్యాలకు ఇతరులను నిందించేందుకు వేళ్లు చూపే బదులు తన స‌మ‌స్య‌ను తాను చూసుకోవాలని భారత్ పేర్కొంది.

జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడికి పాల్పడిన తిరుగుబాటుదారులు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ గురువారం ప్రకటించారు. షఫ్కత్ అలీ ఖాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “పాకిస్తాన్‌లో ఉగ్రవాదానికి భారతదేశం ప్రమేయం ఉంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడిలో ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న వారి నిర్వాహకులు.. నాయకులతో టచ్‌లో ఉన్నారు." తరచుగా సరిహద్దు ఘర్షణలు, ఇస్లామాబాద్ వాదనల కారణంగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

మరోవైపు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. రైలులో ప్రయాణిస్తున్న పాకిస్తాన్ సైనిక సిబ్బందిని మాత్రమే బందీలుగా పట్టుకున్నారని.. మహిళలు, పిల్లలు, వృద్ధులతో సహా ఇతర ప్రయాణికులను వారి స్వంత స్వంత స్థ‌లాల‌కు వెళ్ల‌డానికి అనుమతించిన‌ట్లు పేర్కొంది. సైన్యంతో ఇంకా పోరాటం కొనసాగుతోందన్నారు.

ఈ దాడికి సంబంధించి బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేస్తున్న BLA.. 20 మంది సైనికులను చంపి, డ్రోన్‌ను కూల్చివేసినట్లు తెలిపింది. ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోకుంటే భద్రతా బలగాలను చంపేస్తామని ఉగ్రవాదులు బెదిరించారు.

Next Story