నాయకుల దోపిడీ పాకిస్థాన్‌ను ఎలా నాశనం చేసిందో చెప్పిన ఐఎంఎఫ్..!

ఉగ్రవాదుల స్థావరమైన పాకిస్థాన్‌లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కొత్త నివేదికలో వెలుగు చూసింది.

By -  Medi Samrat
Published on : 24 Nov 2025 9:41 AM IST

నాయకుల దోపిడీ పాకిస్థాన్‌ను ఎలా నాశనం చేసిందో చెప్పిన ఐఎంఎఫ్..!

ఉగ్రవాదుల స్థావరమైన పాకిస్థాన్‌లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కొత్త నివేదికలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి 186 పేజీల గవర్నెన్స్ అండ్ కరప్షన్ డయాగ్నస్టిక్ రిపోర్టును ఐఎంఎఫ్ విడుదల చేసింది. ఈ నివేదిక పాకిస్తాన్ లోతైన పాలనా వైఫల్యాలను బట్టబయలు చేస్తుంది. అవినీతి దేశ రాజకీయాలు ఆర్థిక నిర్మాణాన్ని పూర్తిగా ఖాళీ చేశాయ‌ని హెచ్చరించింది. పాకిస్థాన్‌ అవినీతితో దెబ్బతింటుందని నివేదిక పేర్కొంది. వృద్ధిని అణగదొక్కడం, మార్కెట్లను వక్రీకరించడం, ప్రభుత్వ సంస్థలకు తూట్లు పొడిచే నిర్ణ‌యాలు, తప్పుడు పంటలు దేశ పాలనను బలహీనపరిచాయని నివేదిక పేర్కొంది.

IMF బృందం స్పష్టంగా 'అవినీతి, ప్రజా నిధులను మళ్లించడం, మార్కెట్‌ను వక్రీకరించడం, న్యాయమైన పోటీని అడ్డుకోవడం, దేశీయ, విదేశీ పెట్టుబడులను నిలిపివేయడంతోపాటు ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయడం ద్వారా పాకిస్తాన్ స్థూల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని నివేదిక వెల్ల‌డించింది. ప్రపంచవ్యాప్తంగా అవినీతిని నియంత్రించడంలో అధ్వాన్నంగా పని చేస్తున్న దేశాలలో పాకిస్థాన్‌ను అగ్ర‌గామిగా పేర్కొంటూ.. రెండు దశాబ్దాల పాలనా సూచికలను ఉటంకిస్తూ నివేదికలో వివ‌రాలు పొందుప‌రిచింది. అవినీతి సొమ్ము సంపన్నులు స్వాధీనం చేసుకుంటారని.. 'అత్యంత నష్టపరిచే కేసులలో నిర్దిష్ట ఆర్థిక రంగాలను ప్రభావితం చేసే ప్రత్యేక సంస్థలు ఉన్నాయి' అని పేర్కొంది. వీరిలో చాలా మంది ప్రభుత్వంతోనే నేరుగా సంబంధం కలిగి ఉన్నారని నివేదిక వెల్ల‌డించింది.

జనవరి 2023, డిసెంబర్ 2024 మధ్య పాకిస్తాన్ రూ. 5.3 ట్రిలియన్ల అవినీతికి సంబంధించిన రికవరీలను నివేదించిందని IMF వెల్ల‌డించింది. ఇది ఆర్థిక వ్యవస్థకు జరిగిన వాస్తవ నష్టంలో "కేవలం కొంత భాగం" అని పేర్కొంది. పాకిస్థాన్ న్యాయవ్యవస్థపై కూడా IMF తీవ్ర విమర్శలు చేసింది.

న్యాయపరమైన బలహీనతలు కాంట్రాక్టులను అమలు చేయడానికి లేదా ఆస్తి హక్కులను పరిరక్షించడానికి న్యాయస్థానాలపై ఆధారపడకుండా నిరోధిస్తాయి, దీర్ఘకాలిక పెట్టుబడికి ఆటంకం కలిగిస్తాయి. శక్తివంతమైనవారు శిక్ష నుండి తప్పించుకోవడానికి అనుమతిస్తాయి. కరప్షన్ పర్సెప్షన్ సర్వేలలో అత్యంత అవినీతి సంస్థలలో న్యాయవ్యవస్థ, పోలీసులు స్థిరంగా నిలిచారని నివేదిక పేర్కొంది. జాతీయ సర్వే డేటాను ఉటంకిస్తూ.. 68% మంది పాకిస్థానీలు అవినీతి నిరోధక సంస్థలను రాజకీయ బలిపశువుల కోసం ఉపయోగిస్తున్నారని నమ్ముతున్నట్లు ఫండ్ తెలిపింది.

పెట్టుబడి నిర్ణయాలను నియంత్రించే పౌర-సైనిక ఫోరమ్ అయిన స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ (SIFC)ని కూడా IMF పర్యవేక్షిస్తుంది. SIFC పారదర్శకత, జవాబుదారీ నియమాల గురించి ఎలాంటి పరిశీలన లేకుండా పనిచేస్తుందని హెచ్చరించింది. పాకిస్తాన్ పాలనలో సంస్కరణలు అమలు చేస్తే.. ఐదేళ్లలో దాని GDP 5-6.5 శాతం పెరగవచ్చని IMF అంచనా వేసింది.

Next Story