ప్రతి నీటి బొట్టు మాదే.. జలయుద్ధంగా అభివర్ణించిన పాక్

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ఖండించింది.

By Medi Samrat
Published on : 24 April 2025 9:29 PM IST

ప్రతి నీటి బొట్టు మాదే.. జలయుద్ధంగా అభివర్ణించిన పాక్

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ఖండించింది. ఇది జల యుద్ధానికి కారణమవుతుందని, చట్టవిరుద్ధమైన చర్యగా అభివర్ణించింది. ఈ చర్యను చట్టబద్ధంగా సవాలు చేస్తామని, ప్రపంచ బ్యాంకు వంటి ప్రపంచ సంస్థలు పాల్గొన్న ఒప్పందం నుండి భారతదేశం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదని పాకిస్తాన్ తెలిపింది. "సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడం జల యుద్ధం, పిరికితనం, చట్టవిరుద్ధమైన చర్య. ప్రతి చుక్క పాకిస్తానీయుల హక్కు, చట్టబద్ధంగా, రాజకీయంగా పోరాడుతాము" అని పాకిస్తాన్ ఇంధన మంత్రి అవాయిస్ లెఘారి ట్వీట్ చేశారు.

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో పాకిస్తాన్‌పై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు, దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలను ఇరు దేశాలు పంచుకుంటున్నాయి. పాకిస్థాన్‌లోని కోట్ల మంది ప్రజలకు ఈ నదులే ప్రధాన నీటి వనరు. 1960 సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1965, 1971, 1999 యుద్ధాల సమయంలోనూ నిలిచిన ఈ చారిత్రక ఒప్పందాన్ని భారత్ ఇప్పుడు నిలిపివేసింది. సింధు నది ఒప్పందం రద్దు చేయడం వలన పాకిస్థాన్ లో నీటిపారుదల, తాగునీరు, జల విద్యుత్ కోసం నీటి లభ్యత గణనీయంగా తగ్గుతుంది.

Next Story