అయ్యయ్యో.. ట్రంప్ కు మరో షాక్
No Donald Trump In Forbes 400 Rich List For First Time In 25 Years. డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి అన్ని విషయాల్లోనూ
By Medi Samrat Published on 6 Oct 2021 10:41 AM GMTడొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి అన్ని విషయాల్లోనూ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాకు దూరమైనానని ఇప్పటికే ఏడుస్తున్న ట్రంప్ తాజాగా ఆర్థికంగా కూడా దెబ్బ తిన్నాడు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని కోల్పోయిన తర్వాత రియల్ ఎస్టేట్ విషయం లో కూడా తీవ్రంగా నష్టపోయాడట..! ఎంతలా అంటే గత 25 సంవత్సరాలలో తొలిసారిగా అమెరికాలోని అత్యంత ధనవంతుల ఫోర్బ్స్ 400 జాబితాలో స్థానాన్ని కోల్పోయే అంతలా..! ఫోర్బ్స్ నివేదిక ప్రకారం కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి ట్రంప్ 600 మిలియన్ డాలర్లు సంపదను కోల్పోయాడు.
ట్రంప్ సంపద విలువ 2.5 బిలియన్ డాలర్లు కాగా.. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవాలంటే మరో 400 మిలియన్ డాలర్లు అవసరమని ఫోర్బ్స్ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ చేతిలో ఓటమి పాలైన ట్రంప్ ఆస్తుల విలువ ఏమాత్రం పెరగలేదు. ఫలితంగా అమెరికాలోని 400 మంది అత్యంత సంపన్నుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్‌కు చోటు దక్కలేదు. తాజాగా 'ఫోర్బ్స్ 400' జాబితాలో ట్రంప్ చోటు కోల్పోవడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారని ఫోర్బ్స్ వెల్లడించింది.
ఇక యూఎస్ కాపిటల్ భవనంపై దాడి సమయంలో హింసను ప్రేరేపించేలా కామెంట్లు చేశారని పేర్కొంటూ ట్విట్టర్, ఫేస్ బుక్ రెండు సంస్థలూ ట్రంప్ ఖాతాలను బ్యాన్ చేశాయి. దీంతో ట్రంప్ ఫ్లోరిడాలోని కోర్టులో కేసు వేశారు. తన ఖాతాలను పునరుద్ధరించేలా ఫేస్ బుక్, ట్విట్టర్ సంస్థలను ఆదేశించాలని ట్రంప్ కోరారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ట్రంప్ తన ఖాతాలు బ్యాన్ అయినప్పటి నుంచి ప్రజలకు ఏం చెప్పాలన్నా కష్టంగా ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.