తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో జరిగిన పేలుడులో తొమ్మిది మంది పిల్లలు మరణించారు. నలుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని తాలిబాన్ నియమించిన గవర్నర్ కార్యాలయం ధృవీకరించింది. తూర్పు నాగర్‌హర్ ప్రావిన్స్‌లోని లాలోపర్ జిల్లాలో ఆహార పదార్థాలను విక్రయిస్తున్న పాత బండి, మోర్టార్ షెల్‌ను ఢీకొనడంతో పేలుడు సంభవించిందని గవర్నర్ కార్యాలయం నుండి ఒక ప్రకటన తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు వెంటనే అందుబాటులో లేవు.
ఈ ప్రావిన్స్‌లో తాలిబాన్ ప్రత్యర్థుల ప్రధాన కార్యాలయం ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉంది. ఇది గత సంవత్సరం ఆగస్టు మధ్యలో తాలిబాన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్ యొక్క కొత్త పాలకులను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులను నిర్వహించింది. అయినప్పటికీ ఐఎస్ ఆఫ్ఘనిస్తాన్‌లో 2014 నుండి పనిచేస్తోంది. డజన్ల కొద్దీ భయంకరమైన దాడులను నిర్వహిస్తోంది. చాలా తరచుగా దేశంలోని మైనారిటీ షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. దేశంలో దశాబ్దాల యుద్ధం, సంఘర్షణల వల్ల అత్యధికంగా పేలని ల్యాండ్ మైన్స్, ఇతర ఆయుధాలు ఉన్న దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ ఒకటి.