మానవాళికి పొంచి ఉన్న మరో వైరస్ ముప్పు..!
New Covid-like virus found in Russian bats. మానవాళికి మరో వైరస్ మహమ్మారి ముప్పు పొంచి ఉందని అంటున్నారు.
By Medi Samrat Published on 24 Sep 2022 2:45 PM GMTమానవాళికి మరో వైరస్ మహమ్మారి ముప్పు పొంచి ఉందని అంటున్నారు. రష్యాలోని గబ్బిలాల్లో 'ఖోస్తా–2' అనే వైరస్ మనుషులకు వ్యాపించే ప్రమాదం ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాకు చెందిన వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. 'ఖోస్తా–2' వైరస్ అనేది కరోనా వైరస్ లలో ఉప జాతి అయిన సర్బెకో వైరస్ రకానికి చెందినదని చెబుతున్నారు. కరోనా వైరస్ ల కంటే దీటుగా ఖోస్తా–2 వైరస్ మానవ కణాలపై దాడి చేసి.. అందులో సంతతిని పెంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వైరస్ ల తరహాలోనే మానవ కణాల్లోని ఏసీఈ–2 రిసెప్టార్ కు ఈ వైరస్ అతుక్కుని కణాల్లో ప్రవేశిస్తుందని.. ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థ, జ్వరం వంటి లక్షణాలను కలిగించగలదని అంచనా వేశారు.
ప్రస్తుతమున్న కోవిడ్, ఇతర వైరస్ లకు సంబంధించిన వ్యాక్సిన్లు ఏవీ కూడా ఈ కొత్త వైరస్ నుంచి రక్షణ కల్పించలేవని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్తులో ఈ వైరస్ మానవాళికి విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. సర్బెకో వైరస్ జాతికి సంబంధించి ప్రత్యేక వ్యాక్సిన్ల రూపకల్పనపై దృష్టిసారించాల్సి ఉందని పేర్కొన్నారు. 'పీఎల్ఓఎస్ పాథోజెన్స్' అనే జర్నల్ లో దీనికి సంబంధించిన వివరాలు ప్రచురితం అయ్యాయి.