అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ పన్ను తగ్గింపు మరియు వ్యయ బిల్లు (బిగ్ బ్యూటిఫుల్ బిల్)ను ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా-స్పేస్‌ఎక్స్ యజమాని ఎలోన్ మస్క్ మళ్లీ తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లుకు మద్దతిచ్చే ఎంపీలు వచ్చే ఏడాది జరిగే ప్రైమరీ ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి ఉంటుందని మస్క్ స్పష్టమైన మాటలతో చెప్పారు. మస్క్ ఈ బిల్లును పిచ్చి, విధ్వంసకర బిల్లుగా అభివర్ణించారు. ఇలాంటివి దేశానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.
శనివారం ఈ బిల్లుపై సెనేట్‌లో చర్చిస్తున్న వేళ.. మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చినా.. ఈ బిల్లుకు మద్దతిచ్చిన ఎంపీలు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆయన సోమవారం తన విమర్శలను తీవ్రం చేశారు. నా తుది శ్వాస వరకు పోరాడాల్సి వచ్చినా సరే.. వచ్చే ఏడాది జరిగే ప్రైమరీల్లో బిల్లుకు మద్దతిచ్చే ఎంపీలు ఓడిపోతారు’’ అని మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ బిల్లు చాలా ఖరీదైనదని, దానిని "పోర్కీ పిగ్ పార్టీ" బిల్లుగా అభివర్ణించారు. ఈ పదం వృధా ఖర్చు కోసం ఉపయోగిస్తారు. కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకతను నొక్కిచెప్పిన మస్క్.. "ప్రజల పట్ల నిజంగా శ్రద్ధ వహించే పార్టీని సృష్టించే సమయం ఆసన్నమైంది" అని రాశారు.
మస్క్‌కి ఉన్న ఈ కోపం ట్రంప్‌తో ఆయనకు ఏర్పడిన దూరానికి ప్రతిబింబం అని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల కోసం మస్క్ సుమారు $300 మిలియన్లు ఖర్చు చేశాడు. ట్రంప్ పరిపాలన విభాగంలో మస్క్ వివాదాస్పద ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE)కు అధిపతిగా ఉండేవారు. ఈ విభాగంలో, ప్రభుత్వ ఖర్చులను తగ్గించే బాధ్యతను మస్క్ నిర్వహించేవారు.
ఈ బిల్లు జాతీయ రుణాన్ని మరింత పెంచుతుందని.. DOGE ద్వారా చేసిన పొదుపు మొత్తాన్ని తుడిచివేస్తుందని మస్క్ చెప్పారు. అయితే మస్క్ మాటలు అమెరికా కాంగ్రెస్ పై ఎంత ప్రభావం చూపుతాయో.. బిల్లు ఆమోదానికి ఎంత ఆటంకం కలుగుతుందో చెప్పలేం.. అయితే.. రిపబ్లికన్ పార్టీ.. మస్క్-ట్రంప్ మధ్య ఈ వివాదం 2026 మధ్యంతర ఎన్నికలలో మెజారిటీకి వారి మార్గానికి అవరోధంగా మారుతుందని భయపడుతోంది.