క్రిస్మస్ రోజున అమెరికాలో భారీ బాంబు పేలుడు
Motor Home Explodes in Nashville. క్రిస్మస్ పర్వదినం రోజు అమెరికాలో బాంబు పేలుడు సంభవించింది. మరో 15 నిమిషాల్లో
By Medi Samrat Published on 26 Dec 2020 5:00 AM GMTక్రిస్మస్ పర్వదినం రోజు అమెరికాలో బాంబు పేలుడు సంభవించింది. మరో 15 నిమిషాల్లో ఈ ప్రాంతంలో బాంబు పేలే ప్రమాదం ఉంది అంటూ రికార్డ్ చేసి ఉంచిన సందేశం వినపడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దగ్గరలోని భవనాలు, ఇళ్ల నుంచి అందరిని ఖాళీ చేయించారు. టెన్నెసీ రాష్ట్రం నాష్‌విల్లే నగరంలోని ఓ ప్రాంతంలో ఆగి ఉన్న వాహనంలో ఈ పేలుడు సంభవించింది.
శుక్రవారం ఉదయం 6.30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో బార్లు, రెస్టారెంట్లు అధికంగా ఉంటాయి. కానీ పేలుడు ఉదయం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు, కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడినట్లు గుర్తించారు. అయితే పేలుడు సంభవించిన ప్రాంతంలో మానవ శరీరానికి సంబంధించిన అవశేషాలు గుర్తించామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే.. అవి ఎవరివి అనేది మాత్రం ఇంకా గుర్తించలేదు. పేలుడికి కారణమైన దుండగుడివే కావచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, పేలుడు జరగడానికి ముందే అక్కడ కాల్పులు జరుగుతున్నట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాలిస్తున్న సమయంలో మరో పావుగంటలో ఇక్కడ బాంబు పేలే ప్రమాదం ఉందన్న ఆడియో వినిపించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని ఇళ్లు, భవనాల నుంచి పలువురిని ఖాళీ చేయించారు. ఆ తర్వాత కాసేపటికే నిలిపి ఉంచిన వ్యాన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది.