ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌లను భారత్‌కు విక్రయించాలనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా చెప్పారు. అమెరికా ఆర్మీకి చెందిన అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ ఎఫ్-35లను భారత్‌కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రధాని మోదీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ట్రంప్ ఆఫర్ పాకిస్థాన్‌కు ఆగ్రహం తెప్పించడం గమనార్హం.
అరబ్ న్యూస్ కథనం ప్రకారం.. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. అమెరికా భారతదేశానికి ఎఫ్ -35 ఫైటర్ జెట్‌లను విక్రయిస్తే.. అది దక్షిణాసియాలో సైనిక అసమతుల్యతను పెంచుతుందని.. వ్యూహాత్మక స్థిరత్వాన్ని తగ్గిస్తుందని.. ఇది శాంతికి మంచిది కాదు.. ఎఫ్-35 యుద్ధ విమానాలను భారత్‌కు విక్రయించాలన్న అమెరికా నిర్ణయం ఏకపక్షంగా, తప్పుదోవ పట్టించేదని, దౌత్య నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు.
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్త ప్రకటనలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్థాన్‌ను మందలించింది. ఉగ్రవాద దాడులకు పాకిస్థాన్ తన భూభాగాన్ని ఉపయోగించరాదని ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది.
F-35 ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేయడానికి భారతదేశం అంగీకరిస్తే, అది నాటోయేతర, నాన్-పసిఫిక్ US మిత్రదేశంగా మారిన మొదటి దేశంగా అవతరిస్తుంది. F-35 అనేది ఐదవ తరం స్టీల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, ఇందులో అధునాతన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లు, ఓపెన్ ఆర్కిటెక్చర్, అధునాతన సెన్సార్లు, అసాధారణమైన ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సామర్థ్యాలు ఉన్నాయి.