మెహుల్ చోక్సీకి ఊహించని షాక్

Mehul Choksi Denied Bail By Dominica Court In Illegal Entry Case. వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి ఊహించని షాక్ తగిలింది. డొమినికా కోర్టు మెహుల్

By Medi Samrat  Published on  3 Jun 2021 1:37 PM IST
మెహుల్ చోక్సీకి ఊహించని షాక్

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి ఊహించని షాక్ తగిలింది. డొమినికా కోర్టు మెహుల్ చోక్సీకి బెయిల్‌ను నిరాకరించింది. అంటిగ్వాలో గత సోమవారం అదృశ్యమైన చోక్సి అక్రమంగా డొమినికాలోకి ప్రవేశించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డొమినికా బీచ్‌లో ఆయన ఓ యువతితో కలిసి పట్టుబడినట్టు స్థానిక మీడియా ప్రచారం చేసింది. కిడ్నాపర్ల ముఠాలోని యువతే చోక్సీని ట్రాప్ చేసినట్టు ఆయన తరఫున న్యాయవాదులు తెలిపారు. న్యాయస్థానం ఎదుట గురువారం వీల్ ఛైర్‌లో హాజరైన చోక్సీ.. తనపై తప్పుడు కేసు బనాయించారని, ఏ నేరాలకు పాల్పడలేదన్నారు. తనను కిడ్నాప్ చేసినట్లు తెలిపాడు.

డొమినికాలోని వివిధ దేశాలకు చెందిన పౌరులు ఇటువంటి కేసుల్లో బెయిల్‌పై ఉన్నారని.. కాబట్టి మా క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాలని.. అక్రమ ప్రవేశానికి గరిష్టంగా 10,000 డాలర్ల పూచీకత్తు సహా కఠినమైన షరతులను చేర్చండని చోక్సీ తరఫున న్యాయవాది వాదించారు. చోక్సీ పారిపోయే ప్రమాదం ఉందని, అందుకే బెయిల్ మంజూరు చేయవద్దని డొమినికన్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మెహుల్ చోక్సీకి డొమినికాలో సంబంధాలు లేవని.. బెయిల్ ఇస్తే పారిపోయే ఉద్దేశం ఉందని.. భారత్‌లోని 11 నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేసిందని ప్రభుత్వ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి చోక్సికీ బెయిల్ ఇవ్వలేదు.

మే 23న అంటిగ్వా-బార్బడాలో మిస్సయిన మెహుల్ చోక్సీ.. రెండు రోజుల తర్వాత డొమినికాలో పట్టుబడ్డారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చోక్సీ 2018 జనవరిలో భారత దేశం విడిచి పారిపోయారు. అంటిగ్వా పౌరసత్వం స్వీకరించిన మెహుల్ చోక్సీ అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. మెహుల్ చోక్సీని భారత్ కు రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.


Next Story