శివంగిలా పాక్ కు అదిరిపోయే సమాధానం ఇచ్చిన స్నేహ దూబే
Meet the IFS officer who gave fiery response to Imran Khan at UN. ఐరాస సాధారణ సభ సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించాడు.
By Medi Samrat Published on 25 Sept 2021 5:05 PM ISTఐరాస సాధారణ సభ సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించాడు. దీంతో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు సమాధానాన్ని భారత తొలి కార్యదర్శి స్నేహా దూబే ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సాయం చేయడం, మద్దతునివ్వడంలో ఘనమైన చరిత్ర, విధానాలు పాక్ సొంతమని ఉదాహరణలతో సహా స్నేహ చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గుర్తించిన అనేక మంది ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇవ్వడంలో పాక్ ది ఘనమైన చరిత్ర అని గట్టిగా బదులిచ్చారు స్నేహ. భారత దేశానికి వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు, హానికరమైన ప్రచారానికి ఐరాస వేదికను పాక్ ఉపయోగించుకోవడం ఇదే తొలిసారి కాదు.. ఆ దేశాధినేతలు ఈ వేదికను దుర్వినియోగం చేస్తున్నారు.. ఉగ్రవాదులకు స్వర్గంగా మారడం వల్ల సాధారణ ప్రజలు, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారి జీవితాలు తల్లకిందులు కావడంతో ప్రపంచం దృష్టిని మరల్చడానికి భారత్‌పై ఇటువంటి ఆరోపణలు చేస్తోందనిస్నేహ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. యూఎన్‌లో స్నేహ దూబే మాట్లాడిన తీరు పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
యూఎన్‌లో భారత్ తరపున ఫస్ట్ సెక్రటరీగా ఉన్నారు స్నేహ దూబే. గోవాలో స్కూల్ విద్యను పూర్తి చేసి పూణెలోని ఫెర్గూసన్ కాలేజీ నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. ఢిల్లీలోని జవర్‌లాల్ నెహ్రూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి ఎంఫిల్ పూర్తి చేశారు. 12 ఏళ్ల వయసులోనూ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌లో ఉద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని 2011లో సివిల్ సర్వీసెస్ రాశారు. మొదటి ప్రయత్నంలోనే ఆమె పాసైంది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కావడం వల్ల తాను దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఫారిన్ సర్వీస్‌కు ఎంపికైన తర్వాత విదేశీ వ్యవహారాల శాఖలో తొలిసారి ఆమె అపాయింట్ అయ్యారు. 2014లో మాడ్రిడ్‌లో ఉన్న ఎంబసీలో ఆమె తొలి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం యూఎన్‌లో ఇండియా ఫస్ట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. స్నేహ దూబే తండ్రి ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి స్కూల్ టీచర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.